డిండి: ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక డిండి మండలంలోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. వానాకాలం సాగు ప్రారంభ దశలో ముందస్తు కురిసిన వర్షాలకు ఆశాజనకంగా కన్పించిన పంటలు ఆ తర్వాత వరుణుడు కరుణించక ఎండిపోవడంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయి. ప్రభుత్వం డిండిని కరువు మండలంగా ప్రకటించినప్పటికీ క్షేత్ర స్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టం ఆందోళనకు గురి చేస్తోంది.
కేఎల్‌ఐ ద్వారా నీరు రావడంతో..
మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టు కింద వానాకాలం సాగులో భాగంగా దాదాపు 18200 ఎకరాల్లో వరి పంట సాగైంది. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు మొదటగా విడుదల చేసిన సమయంలో ఇరిగేషన్ శాఖ సిబ్బంది ఎలాంటి ప్రణాళికలు లేకుండా దిగువకు వదలడంతో ఒక టీఎంసీ నీరు వృథాగా వాగులోకి పోయి పంట చివరి దశలో ఆయకట్టుకు నీరందటం కష్టంగా మారింది. దీంతో ఎండుతున్న పంటలను కాపాడాలని స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ కేఎల్‌ఐ నుంచి డిండి ప్రాజెక్టులోకి నీరందించాలని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కేఎల్‌ఐ నుంచి డిండికి కొంత నీరు రావడంతో పంట నష్టం తగ్గింది. ప్రాజెక్టులోకి నీరు రావడం కొంత ఆలస్యం కావడంతో అప్పటికే 770 ఎకరాల్లో వరి పపంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. అదేవిధంగా 14700 ఎకరాల్లో పత్తి సాగు చేయగా వర్షాభావ పరిస్థితుల వల్ల దాదాపు 5200 ఎకరాల వరకు పత్తిపంట ఎండిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
కరువు మండలలంగా ప్రకటించిన ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు ప్రాథమికంగా గుర్తించిన పంట నష్టాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే చేయాలి. అర్హులైన రైతులందరికీ పరిహారం అందించేలా చూడాలి.
– ఎండీ మైనోద్దిన్, సీపీఐ
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
ఫ డిండి ఆయకట్టు కింద 800 ఎకరాల్లో ఎండిన వరి
ఫ 5200 ఎకరాల్లో పత్తి పంట నష్టం
ఫ ప్రాథమికంగా గుర్తించిన వ్యవసాయాధికారులు


