మీరు తీసుకున్న అప్పునకు.. బంగారం సరిపోదండి! | - | Sakshi
Sakshi News home page

మీరు తీసుకున్న అప్పునకు.. బంగారం సరిపోదండి!

Nov 25 2026 4:00 AM | Updated on Nov 25 2026 4:00 AM

ఉమ్మడి జిల్లాలో రూ.10 వేల కోట్లు

బంగారం ధర తగ్గడంతో అదనపు తనఖా కోసం బ్యాంకర్ల మెసేజ్‌లు

నల్లగొండ పట్టణానికి చెందిన శ్రీనివాస్‌ ఈ ఏడాది జనవరిలో ఓ జాతీయ బ్యాంకు నుంచి గోల్డ్‌ లోన్‌ తీసుకున్నారు. 8 తులాల బంగారం తనఖా పెట్టారు. అప్పట్లో బంగారం ధర తులానికి రూ.లక్షా 40వేలు ఉంది. అప్పు రూ.5 లక్షలకు మించి తీసుకుంటే తనఖా పెట్టిన బంగారంపై 75 శాతమే (లోన్‌ టూ వ్యాల్యూ–ఎల్‌టీవీ) ఇస్తారు. దాని ప్రకారం రూ.1.05 లక్షల చొప్పున రూ.8.40 లక్షలు లోన్‌ తీసుకున్నారు. బంగారం ధర తులానికి రూ.1.26 లక్షలకు తగ్గింది. దీంతో తీసుకున్న రుణంపై పెట్టిన బంగారం విలువ ఎల్‌టీవీ ప్రకారం తులానికి రూ.94 వేలకు తగ్గిపోయింది. దీంతో శ్రీనివాస్‌ ఒక్కో తులంపై రూ.11 వేల చొప్పున రూ.88 వేలు బ్యాంకుకు చెల్లించాలని లేదంటే ఆ మరింత బంగారం తనఖా పెట్టాలని మెసేజ్‌ పంపించారు.

బంగారం ధరలు పెరుగుతున్నప్పుడు ఒకలా.. తగ్గుతున్నప్పుడు మరోలా.. బ్యాంకుల వైఖరితో గోల్డ్‌ లోన్‌ ఖాతాదారులు ఆందోళచెందుతున్నారు. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న సమయంలో ఆభరణాలను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నవారికి బ్యాంకుల నుంచి అదనపు రుణాల ఆఫర్లు వచ్చాయి. తీసుకున్న అప్పును సకాలంలో చెల్లించే సమయంలోనూ బంగారం విలువ పెరిగిందని, ఇంకా అదనంగా అప్పు కావాలా.. అంటూ బ్యాంకు సిబ్బంది ఖాతాదారులను సంప్రదించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో బ్యాంకుల నుంచి అదనపు బంగారం తనఖా పెట్టాలని, లేదంటే కొంత నగదు చెల్లించాలని ఫోన్లు, మెసేజ్‌లు పంపిస్తున్నారు.

అప్పట్లో ఊరించిన అదనపు అప్పు

బంగారం ధరలు వరుసగా పెరుగుతూ తులం ధర రూ.1.50 లక్షలు దాటిన సమయంలో చాలామంది తమ ఆభరణాలను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఒక్కో తులానికి రూ.1.20 లక్షల వరకు రుణం తీసుకున్నారు. ఆ సమయంలో బంగారం విలువ పెరుగుతుండటంతో తనఖా పెట్టిన ఆభరణాలపై మరింత రుణం పొందే అవకాశం ఉందని బ్యాంకు సిబ్బంది ఖాతాదారులకు సూచించారు. దీంతో కొందరు ఖాతాదారులు అదనపు అప్పు తీసుకున్నారు.

ఇప్పుడు సీన్‌ రివర్స్‌..

ఇటీవల బంగారం ధరలు తగ్గడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గతంలో తనఖా పెట్టిన బంగారం విలువ ఆధారంగా మంజూరైన రుణాలకు సంబంధించి ఇప్పుడు బ్యాంకులు అప్రమత్తమవుతున్నాయి. బంగారం ధర తులానికి రూ.1.29 లక్షలకు తగ్గడంతో రుణానికి భద్రతగా ఉన్న ఆభరణాల విలువ కూడా తగ్గిందని, ఖాతాలో మార్జిన్‌ లోటు ఏర్పడిందని, అవసరమైన మార్జిన్‌ను కొనసాగించాలని, అందుకు అదనంగా మరికొంత బంగారు తనఖా పెట్టాలని ఖాతాదారులపై ఒత్తిడి పెంచాయి. లేదంటే రుణంలో కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అడుగుతున్నారు.

ఫోన్లు, మెసేజ్‌లతో ఉక్కిరిబిక్కిరి...

గోల్డ్‌ లోన్‌ తీసుకున్నవారికి బ్యాంకుల నుంచి వరుసగా ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఖాతాదారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి బంగారం తనఖా పెట్టిన సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఇది కొత్త భారంగా మారుతోంది. పెళ్లిళ్లు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, వ్యాపార అవసరాల కోసం రుణాలు తీసుకున్నవారు ఇప్పుడు మరోసారి డబ్బులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అదనపు బంగారం లేదా నగదు ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ ఆందోళన చెందుతున్నారు. ఒక్కో తులానికి రూ.లక్షకు పైగా రుణం పొందిన వారికి బ్యాంకర్లు అదనంగా బంగారం తనఖా పెట్టాలని, లేదంటే డబ్బు చెల్లించాలని మేసేజ్‌లు పంపుతున్నట్లు తెలిసింది.

లేదంటే.. రుణానికి సరిపడా బ్యాలెన్స్‌ చెల్లించాలని ఖాతాదారులకు సూచనలు

ఫ తులం ధర రూ.1.50 లక్షలు ఉన్నప్పుడు రూ.లక్షకుపైగా రుణం

ఫ ఇప్పుడు ధర తగ్గడంతో.. లోన్‌ తీసుకున్న మేరకు సర్దుబాటు చేయాలని ఒత్తిడి

ఫ ధరల పతనంతో ఆందోళనలో గోల్డ్‌ లోన్‌ ఖాతాదారులు

ఫ ఉమ్మడి జిల్లాలో రూ.10 వేల కోట్లకు పైగా బంగారం రుణాలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ :

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బంగారంపై తీసుకున్న రుణాలు రూ.10 వేల కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఒక్క నల్లగొండ జిల్లాలోనే రూ.5 వేల కోట్ల వరకు బంగారు అభరణాలపై రుణాలు ఇచ్చినట్లు తెలిసింది.

నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, సహకార, గ్రామీణ బ్యాంకులు కలిపి సుమారు 235 శాఖలు ఉన్నాయి. 2026 మార్చి 31 నాటి స్టేట్‌ లెవెల్‌ బ్యాంకర్స్‌ కమిటీ గణాంకాల ప్రకారం జిల్లాలో రుణాలు రూ.27 వేల కోట్ల వరకు ఉండగా, అందులో బంగారంపై తీసుకున్న రుణాలు రూ.5 వేల కోట్ల వరకు ఉన్నట్లు అంచనా.

సూర్యాపేట జిల్లాలో అన్ని రకాల రుణాలు రూ.17 వేల కోట్ల వరకు ఉండగా, అందులో బంగారంపై తీసుకున్న రుణాలు రూ.3 వేల కోట్లు ఉన్నట్లు తెలిసింది.

యాదాద్రి జిల్లాలో మొత్తం రుణాలు రూ.10 వేల కోట్ల వరకు ఉండగా, బంగారంపై తీసుకున్న రుణాలు రూ.2 వేల కోట్ల వరకు ఉన్నట్లు అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement