ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేశాం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేశాం

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నల్లగొండ : యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తనతో పాటు, అదనపు కలెక్టర్‌, తహసీల్దార్లు, సీనియర్‌ అధికారులు కొనుగోలు కేంద్రాలు, రైస్‌ మిల్లులను సందర్శించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్‌ మిల్లులకు పంపించడం, ధాన్యాన్ని వెంటనే ఆన్‌లోడ్‌ చేసే విధంగా చూస్తున్నామని పేర్కొన్నారు. మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ సమస్య లేకుండా చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు, రైస్‌ మిల్లుల అన్ని సౌకర్యాలను తహసీల్దార్లు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

నల్లగొండ : పోలీస్‌ గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం నల్లగొండలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 28 మంది తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు ఆయనకు వినతులు అందజేశారు. వినతులు స్వీకరించిన ఎస్పీ.. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలి

నల్లగొండ టూటౌన్‌ : అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా చెరువులు, గుట్టలు తవ్వుతున్న మట్టి మాఫీయాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌రెడ్డి సోమవారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లా యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోకుండా 30 నుంచి 40 అడుగులలోతు చెరువుల్లో మట్టి తవ్వుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మట్టి మాఫీయా టిప్పర్లు, ఇతర వాహనాలను వెంటనే సీజ్‌ చేయాలని కోరారు.

బట్రాజ్‌ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

నల్లగొండ టౌన్‌ : బట్రాజ్‌ సంఘం జిల్లా నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సరస్వతి శంకర్‌రాజు, ప్రధాన కార్యదర్శిగా పిచ్చంరాజు, గౌరవ అధ్యక్షుడిగా బొల్లేపల్లి శ్రీనివాసరాజు, కోశాధికారిగా సత్యనారాయణరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

‘నీట్‌’కు ఏర్పాట్లు చేయాలి

నల్లగొండ : వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్‌ ఎల్జిబులిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)కు అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి అధికారులకు సూచించారు. మే 3న నిర్వహించే నీట్‌ ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులతో మాట్లాడారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు దొర్లకుండా పక్కాగా ప్రణాళికలు అమలు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 2,318 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని తెలిపారు. ఎన్‌జీ కాలేజ్‌, ఉమెన్స్‌ డిగ్రీ కాలేజ్‌, ఎంజీయూ పరిధిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. సమావేశంలో ఏఎస్‌పీ రమేష్‌, నీట్‌ జిల్లా కోఆర్డినేటర్‌, కేంద్రియ విద్యాలయ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఓపెన్‌ పరీక్షలు ప్రారంభం

నల్లగొండ : ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌, పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనట్లు డీఈఓ భిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 సెంటర్లలో నిర్వహించిన ఓపెన్‌ ఇంటర్‌ తెలుగు పరీక్షకు 1,759 మందికిగాను 1,512 మంది పరీక్ష రాశారని, 247 మంది గైర్హాజర్‌ అయ్యారని తెలిపారు. 8 సెంటర్లలో నిర్వహించిన ఓపెన్‌ టెన్త్‌ తెలుగు పరీక్షకు 1,334 మందికి 1,141 మంది పరీక్ష రాశారని 193 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement