ధాన్యం కొనాలని రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనాలని రాస్తారోకో

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

పెద్దవూర : ధాన్యం వెంటనే కొనాలని కోరుతూ సోమవారం పెద్దవూర మండల కేంద్రంలోని సబ్‌ మార్కెట్‌ యార్డు కొనుగోలు కేంద్రం ఎదుట జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు రమావత్‌ రవినాయక్‌ మాట్లాడుతూ మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి పదిరోజులు అవుతున్నా.. ఇప్పటివరకు కేవలం నాలుగు లారీల ధాన్యమే కొనుగోలు చేశారని తెలిపారు. ధాన్యంలో సరైన తేమశాతం వచ్చినా.. లారీలు రావడం లేదన్న సాకుతో బస్తాలు ఇవ్వడం లేదని, బస్తాలు ఇచ్చిన రైతుల ధాన్యం మిల్లులకు తరలింకాకే. మిగిలిన రైతులకు బస్తాలు ఇస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎప్పుడు వర్షం వస్తుందోనన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రైతుల రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేసే ప్రయత్నం చేశారు. కలెక్టర్‌గాని, సబ్‌ కలెక్టర్‌గాని వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చేవరకు రాస్తారోకోను విరమింపజేసేది లేదని భీష్మించారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పిన రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో రైతులు ఏరుకొండ నర్సింహ, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement