నలుగురి అరెస్ట్
నల్లగొండ : నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అగ్రికల్చర్(కమర్షియల్) బ్రాంచ్‌లో ఆర్థిక మోసానికి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.42 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను మంగళవారం నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో లెండల చక్రపాణి అనే వ్యక్తి ఐదేళ్లుగా కాంట్రాక్టు బేసిక్‌పై హౌస్‌కీపింగ్‌గా పనిచేస్తున్నాడు. అతడికి కంప్యూటర్ పరిజ్ఞానం తెలియడం వల్ల బ్యాంకు సిబ్బందికి కంప్యూటర్ పనుల్లో సాయం చేసేవాడు. దీంతో బ్యాంకు అంతర్గత వ్యవస్థ గురించి, ఖాతాల నిర్వహణపై అవగాహన ఏర్పడింది. ఈ క్రమంలో అతడికి సూర్యాపేట ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లో మేనేజర్‌గా పనిచేసే పుట్ట వెంకటరామాంజనేయులుతో పరిచయం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చక్రపాణి.. వెంకటరామాంజనేయులుతో కలిసి అక్రమంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వెంకటరామాంజనేయులు తన పరిధిలో ఉన్న ఎంఐఎస్(మేనేజ్‌మెంట్ ఇన్పర్మేషన్ సిస్టం) ద్వారా ఎస్‌బీఐలో గత కొన్నేళ్లుగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న 10 ఖాతాల వివరాలు సేకరించాడు. ఆ తర్వాత చక్రపాణి ఖాతాదారుల పేరు, చిరునామా, ఆధార్, పాన్ కార్డు, ఫొటో, సంతకాల వివరాలు సేకరించి నకిలీ ఆధార్, పాన్‌కార్డులు తయారు చేశాడు. బ్యాంకు ఉద్యోగుల లాగిన్ వివరాలు గమనించి రద్దీ సమయంలో కంప్యూటర్‌లో లాగిన్ అయి ఖాతాలకు కొత్త మొబైల్ నంబర్లు అప్‌లోడ్ చేశాడు. తర్వాత యోనో యాప్ ద్వారా కొత్త యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్లు సృష్టించాడు. మిర్యాలగూడకు చెందిన బ్యాంకు రికవరీ ఏజెంట్ కేతావత్ రామ్‌లాల్, దేవరకొండకు చెందిన ఫొటోగ్రాఫర్ మారేపల్లి శివ ద్వారా తెలిసిన వ్యక్తులకు ‘మీ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి. నగదు ఇవ్వండి. ఇది లీగల్ వ్యవహారం’ అని చెప్పి, కమిషన్ ఆశ చూపి బ్యాంకు ఖాతాలు వివరాలు సేకరించారు. అనంతరం ఇన్‌యాక్టివ్ ఖాతాల్లోని రూ.2.65 కోట్ల నగదును ఇతర వ్యక్తుల నుంచి సేకరించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఈ మొత్తం డబ్బులో 45 శాతం చక్రపాణి, పుట్ట వెంకన్న రామాంజనేయులు, రామ్‌లాల్, మారేపల్లి శివకు 10 శాతం వాటాలు ముందే పంచుకున్నారు.
ఇలా వెలుగులోకి వచ్చింది..
ఈ క్రమంలో నిందితులు హైదరాబాద్‌లోని కోఠి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో నరేందర్ అనే వ్యక్తి ఖాతాకు అక్రమంగా కేవైసీ అప్‌డేట్ చేయగా.. ఆయన ఇటీవల బ్యాంకును సంప్రదించడంతో అసలు విష యం బయటపడింది. ఈ మోసం దేవరకొండ ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి జరిగినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. దేవరకొండ బ్రాంచ్ మేనేజర్ ఫణీంద్ర నీలకంఠ వెంకటరాఘవపూడి ఈ నెల 13న దేవరకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఫ ఇన్‌యాక్టివ్ ఖాతాల నుంచి
నగదు కొట్టేసిన కాంట్రాక్టు ఉద్యోగి
ఫ నిందితుడితో పాటు అతడికి
సహకరించిన మరో ముగ్గురి అరెస్టు
ఫ రూ.2.42 కోట్ల నగదు స్వాధీనం
ఫ వివరాలు వెల్లడించిన
ఎస్పీ శరత్‌చంద్ర పవార్
దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలతో వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేసి ప్రధాన నిందితుడు లెండల చక్రపాణితో పాటు అతడికి సహకరించిన సూర్యాపేట ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ పుట్ట వెంకటరామాంజనేయులు, మిర్యాలగూడకు చెందిన బ్యాంకు రికవరీ ఏజెంట్ కేతావత్ రామ్‌లాల్, దేవరకొండకు చెందిన ఫొటోగ్రాఫర్ మారేపల్లి శివను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.1.10 కోట్ల నగదు, బెనిఫిషరీ ఖాతాల నుంచి రూ.1.31 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. అదేవిధంగా ఆరు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించిన దేవరకొండ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ రాజు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


