గుర్రంపోడు : కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను గ్రహించిన ప్రజలు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం గుర్రంపోడు మండలకేంద్రంలో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచాయని, మిగిలిన రెండున్నరేళ్లలో చివరి ఏడాది ఎన్నికల ఏడాదిపోగా ఏడాదిన్నర సమయమే ఉందన్నారు. కార్యకర్తలు కొద్దిగా ఓపిక పట్టాలని, ఎన్ని వేధింపులకు గురిచేసినా భరించాలని.. బీఆర్‌ఎస్ అధికారం రాగానే వడ్డీతో సహా తీర్చుకుందామని చెప్పారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ వాళ్లకే అర్థమైందన్నారు. అందుకే వారు అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని, ఎస్‌ఎల్‌బీపీ టన్నెల్ బీఆర్‌ఎస్ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వితే, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన టన్నెల్‌లో శవాలను కూడా తీయలేకపోయిందని ధ్వజమెత్తారు. ప్రమాద స్థలానికి టూరిస్టు ప్లేస్‌కు వచ్చినట్లు మంత్రులు విమానంలో చక్కర్లు కొట్టారని విమర్శించారు. అసెంబ్లీలో రుణమాఫీపై ప్రశ్నిస్తే ఇంకా ఏమీ లేదని అయిపోయిందన్నారని, రుణమాఫీ చేసింది కేవలం 40 శాతమేనని చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తున్నారని, మళ్లీ సీఎంగా కేసీఆర్‌ను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అంతకుముందు ఆయన తానేదార్‌పల్లి వద్ద కొనుగోలు కేంద్రంలో ధాన్యం పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి హరీష్‌రావుకు బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, రాజ్యసభ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్, కూసుకుంట్ల ప్రబాకర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, పల్లె రవికుమార్, ఎన్‌ఆర్‌ఐ అమెరికా బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి నాగులవంచ నర్సింహారావు, రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు


