నల్లగొండ అగ్రికల్చర్ : అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రెండో విడత రైతు భరోసా నిధులను సోమవారం రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. భూపాలపల్లి జిల్లా కాటారంలో జరగనున్న బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. మార్చి 23న ప్రభుత్వం మొదటి విడత కింద ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. రెండో విడత నిధుల విడుదలలో కొంత జాప్యం జరగడంతో రైతులు ఆందోళన చెందినప్పటికీ, ప్రభుత్వం తాజా నిర్ణయంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నెలాఖరు నాటికి మూడవ విడత నిధులను కూడా జమ చేసి, ఈ సీజన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మొదటి విడతలో రూ.268.57 కోట్లు
ప్రభుత్వం మొదటి విడతలో 5,22,313 మంది రైతులకు రూ.268.57 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుతం ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తుందో స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం యాసంగి ధాన్యం విక్రయాల్లో బిజీగా ఉన్న రైతులు, త్వరలోనే వానాకాలం సీజన్‌కు సన్నద్ధం కానున్నారు. జూన్ మొదటి వారం నుంచి దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు వంటి పనులకు భారీగా పెట్టుబడి అవసరమవుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు రైతులకు ఎంతో ఊరటనివ్వనున్నాయి.
ఫ నేడు అన్నదాతల ఖాతాల్లోకిపెట్టుబడి సాయం
ఫ నిధులు విడుదల చేస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు


