ఏనుగు నర్సింహారెడ్డి యువతకు ఆదర్శనీయుడు | - | Sakshi
Sakshi News home page

ఏనుగు నర్సింహారెడ్డి యువతకు ఆదర్శనీయుడు

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

చిట్యాల : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఐఏఎస్‌ హోదా పొందిన చిట్యాల పట్టణ వాసి ఏనుగు నర్సింహారెడ్డి నేటి యువతకు ఆదర్శనీయుడని రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కుకుడాల లక్ష్మణ్‌ అన్నారు. ఆదివారం చిట్యాల పట్టణంలో ఏనుగు నర్సింహారెడ్డికి ప్రమోద సాహితి సంస్థ, ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జస్టిస్‌ కుకుడాల లక్ష్మణ్‌, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం హాజరయ్యారు. ఈ సందర్భంగా కుకుడాల లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ఏనుగు నర్సింహారెడ్డి పేదరికంలో ఉండి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఐఏఎస్‌ స్థాయికి ఎదిగారన్నారు. ఆయన ఇప్పటి యువతకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. సాహిత్య రంగంలోనూ రాణిస్తున్న నర్సింహారెడ్డి భవిష్యత్తులోనూ ఉన్నత స్థాయికి చేరుకుని మంచి గుర్తింపు పొందుతారని ఆకాంక్షించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ.. ఏనుగు నర్సింహారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన 19 పుస్తకాలను రచించడంతో పాటు మరో ఎన్నో సాహిత్య సమీక్షలను, కవిత్వాలను రాసి ఇరవై రెండు వరకు అవార్డులు పొందారని పేర్కొన్నారు.

తెలుగు భాషే నిలబెట్టింది..

అనంతరం ఏనుగు నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తనకు చిన్ననాడు చిట్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువు చెప్పిన ఉపాధ్యాయుల ద్వారా తెలుగు భాషపై అభిమానం ఏర్పడిందన్నారు. తెలుగు భాష ద్వారానే సాహిత్య రంగంలో ఎన్నో పుస్తకాలు రాశానన్నారు. అంతేకాకుండా తెలుగు భాష ద్వారా గ్రూప్‌–2 రాసి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించి ఇప్పుడు ఐఏఎస్‌ హోదాను పొందానని గుర్తుచేశారు. విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా తనకు పౌర సన్మానం చేసిన ప్రమోద సాహితీ సంస్థతో పాటు తన చిన్ననాటి స్నేహితులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాహితీ సంస్థ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పందిరి గీతారమేష్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ గుండెబోయిన శ్రీలక్ష్మీసైదులు, ప్రమోద సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి తాడూరి చంద్రం, సృజన సాహితీ అధ్యక్షుడు పెరుమాళ్ల ఆనంద్‌తో పాటు సాహితీవేత్తలు తండు కృష్ణకౌండిన్య, ఏభూషి నర్సింహ, సాగర్ల సత్తయ్య, సిలివేరు నర్సింహ, పాటి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కుకుడాల లక్ష్మణ్‌

Advertisement
 
Advertisement
Advertisement