ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి మృతి

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

సూర్యాపేటటౌన్‌ : ట్రాక్టర్‌ ఢీకొని యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట మండల పరిధిలోని కాసరాబాద్‌ రోడ్డులో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసరాబాద్‌ గ్రామానికి చెందిన కొల్లు సందీప్‌(28) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సూర్యాపేట పట్టణంలో పనులు ముగించుకొని మరో వ్యక్తితో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. కాసరాబాద్‌ గ్రామ సపమీంలోకి రాగానే ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సందీప్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పోలీసులు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

నల్లగొండ : వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట మండల పరిధిలోని మాందాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య(19)కు నల్లగొండ పట్టణ సమీపంలోని పానగల్‌కు చెందిన శివతో ఆరునెలల క్రితం వివాహమైంది. కాగా ఐశ్వర్య శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలు ఐశ్వర్య తల్లిదండ్రులు ఆదివారం నల్లగొండ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్‌

దేవరకొండ : గంజాయి కలిగిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం మైనంపల్లి సమీపంలోని పల్లీ మిల్లులో బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు పని చేస్తున్నారు. శనివారం వారు దేవరకొండలోని రహదారి బంగ్లా సమీపంలో గంజాయి తాగేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకుని 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement