తిప్పర్తి : ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాలు, చెత్త పేరుతో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, కొనుగోలు చేసినా మిల్లర్లు కోత విధిస్తున్నారని, దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. మిల్లుల వద్ద లారీలను రెండు రోజులపాటు నిలిపివేసి.. ఆ తరువాత కోత విధిస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన చేస్తున్నట్లు తెలుసుకున్న తహసీల్దార్ రామకృష్ణ రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి.. కొనుగోళ్లు సాఫీగా సాగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
రైతులతో మాట్లాడిన ఆర్డీఓ అశోక్‌రెడ్డి
తిప్పర్తి కొనుగోలు కేంద్రం వద్ద ఆర్డీఓ అశోక్‌రెడ్డి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతుల రాశుల నుంచి ఒక బస్తా ధాన్యం తూర్పార బట్టి అందులో ఎంతశాతం తాలు వస్తుందో దాని ప్రకారం కొత విధించేలా మిల్లర్లతో మాట్లాడతామని తెలిపారు.


