నల్లగొండ : యాసంగి ధాన్యం సేకరణకు రైస్ మిల్లర్లు సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి కోరారు. శనివారం ఆయన నల్లగొండలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, మిల్లర్లు.. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని, అయితే రైతుకు, మిల్లర్లకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. కొనుగోలు కేంద్రానికి రైతుకు మాత్రమే సంబంధం ఉంటుందని, ఈ విషయంలో రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. తాలు, తరుగు సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలని మిల్లర్లకు సూచించారు. రైతులు కూడా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని కోరారు. నల్లగొండ జిల్లాలో ఒకప్పుడు 4 లక్షలు ఎకరాల్లో బత్తాయి తోటలు ఉండేవని.. ఇప్పుడు 40 వేల ఎకరాలకు పడిపోయాయని.. రైతులు తిరిగి బత్తాయి సాగు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మార్చి 15వ తేదీ వరకు భూభారతి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించామని తెలిపారు. సాదాబైనామా కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించామన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 330 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సమావేశంలో రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, గోపాల్, ఆదర్శ రైతు రామిరెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం మిర్యాలగూడ కార్యదర్శి శ్రీనివాస్, నల్లగొండ కార్యదర్శి భద్రాద్రి రాములు, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీఏఓ శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి


