మొదట్లో ఉక్కుపాదం..
అక్రమ రవాణాను ఉపేక్షించేది లేదు
ఫ అర్ధరాత్రి వేళలో జేసీబీతో తోడేస్తున్న వ్యాపారులు
ఫ అనుమతుల పేరుతో పగటి పూట కూడా రవాణా
ఫ అధికార పార్టీ నాయకుడి అండతో రెచ్చిపోతున్న కొందరు
ఫ చోద్యం చూస్తున్న పోలీస్ అధికారులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కనగల్ మండలంలో ఇసుక వ్యాపారులు రెచ్చిపోతున్నారు. కొందరు అర్ధరాత్రి వేళ జి.ఎడవెల్లి వాగును తోడేస్తున్నారు. ఇసుక తవ్వకంపై రైతులు, గ్రామస్తులు.. పోలీసులకు సమాచారం ఇస్తున్నా ఓ రాజకీయ నాయకుడి ఒత్తిడితో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నెలలో సగం రోజులు ఇందే తంతు..
నెలలో 15 రోజుల వరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అర్ధరాత్రి 2 గంటల సమయంలో వాగులోకి జేసీబీని ఇసుకను తోడి అక్రమ రవాణా చేస్తున్నారు. అలాగే పగటి పూట కూడా అనుమతుల మాటున ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. ఇదే విషయంపై పలుమార్లు పైస్థాయి అధికారులకు కూడా సమాచారం అందించినా వారి నుంచి కూడా ఎలాంటి స్పందన లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.
రాజకీయ ఒత్తిళ్లతో పోలీసుల వెనుకడుగు!
ఒకవేళ పక్కా సమాచారంతో జేసీబీ, ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించినా ఎలాంటి కేసులు నమోదు చేయకుండా తమనే బెదిరిస్తున్నారని పోలీసులు వాపోతున్నారు. వదలమంటే సదరు నాయకుడు రంగంలోకి దిగి ట్రాక్టర్లు స్టేషన్‌కు తీసుకొచ్చిన మరుసటి రోజే రాజకీయ పైరవీలు చేసి దర్జాగా బయటకు తీసుకెళ్తున్నాడు. చేసేదేమీలేక స్టేషన్‌కు వచ్చిన ఇసుక ట్రాక్టర్లను బయటికి పంపిస్తున్నారు. దీంతో రైతులు, గ్రామస్తులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు పట్టుకునేది ఎందుకు, స్టేషన్ తీసుకువచ్చేది ఎందుకు, వదిలి పెట్టేది ఎందుకు అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
అర్ధరాత్రి రెండు గంటల తర్వాత వాగులోకి జేసీబీని దింపి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నా దళారుల్లో మార్పు రావడం లేదు. రాజకీయ నాయకుల అండతో కొన్ని గంటల్లోనే బయటకు వచ్చి మళ్ళీ దందా మొదలుపెడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అరికట్టాలి.
– కందుల లక్ష్మయ్య, జి.ఎడవెల్లి
ప్రస్తుతం కనగల్ ఎస్‌ఐగా పనిచేస్తున్న రాజీవ్‌రెడ్డి అందరి ఎస్‌ఐల మాదిరిగా కాకుండా వచ్చి రాగానే ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఎలాంటి రాజకీయ పైరవీలకు తావులేకుండా అనేక ట్రాక్టర్లు, జేసీబీలపై కేసులు నమోదు చేసి ఇసుక వ్యాపారుల్లో వణుకు పుట్టించారు. కానీ జి.ఎడవెల్లిలో మాత్రం ఇసుక అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికార పార్టీ ముఖ్య నేత కావడంతో పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆ ఎస్‌ఐకి మంచి పేరు ఉన్నప్పటికీ.. ఒక్క జి.ఎడవెల్లి వాగు విషయంలో మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు గురవుతున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు గతంలో ఇక్కడ పనిచేసిన మరో ఎస్‌ఐ ఆ సదరు నేత తీరు వల్ల స్వచ్ఛందంగా వేరేవేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తెలిసింది.
జి.ఎడవల్లి వాగులో అక్రమ ఇసుక రవాణాపై సమాచారం వస్తోంది. ఇటీవలే ఒక జేసీబీ, ట్రాక్టర్‌ను పట్టుకొని కేసు నమోదు చేసి తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశాం. అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో మాపై రాజకీయ ఒత్తిళ్లు వస్తున్న మాట వాస్తవమే. అయినప్పటికీ అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.
– రాజీవ్‌రెడ్డి, ఎస్‌ఐ, కనగల్


