ఆర్టిజన్ల సమ్మె విరమణ | - | Sakshi
Sakshi News home page

ఆర్టిజన్ల సమ్మె విరమణ

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

నల్లగొండ : విద్యుత్‌ శాఖలో పనిచేసే ఆర్టిజన్‌ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పది రోజులుగా నల్లగొండలోని జిల్లా సర్కిల్‌ కార్యాలయం ముందు సమ్మె నిర్వహిస్తున్నారు. 10వ రోజు శుక్రవారం డిప్యూటీ సీఎం, విద్యుత్‌ శాఖ మంత్రి భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టిజన్‌ కార్మికుల సంఘం నేతలు ప్రకటించారు. చివరి రోజు సమ్మెలో నల్లగొండ జేఏసీ నాయకులు జిట్టబోయిన లింగస్వామి, కన్వీనర్‌ మద్ది శ్రీనివాష్‌, విశ్వకుమార్‌, గడ్డం మల్లేష్‌, పున్నకుమార్‌, వేణుగోపాల్‌రెడ్డి, జానయ్య, రమేష్‌, వెంకన్న, శేఖర్‌, లింగయ్య, శ్రీనివాస్‌, యాదగిరి పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శిపై బదిలీ వేటు

శాలిగౌరారం : శాలిగౌరారం పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్‌పై బదిలీ వేటు పడింది. ఎంపీడీఓపై మండల పంచాయతీ కార్యదర్శులు.. ఒకరిపై మరొకరు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో రెండురోజుల క్రితం అదనపు కలెక్టర్‌ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. దీంతో కలెక్టర్‌ చంద్రశేఖర్‌ స్పందించి శాలిగౌరారం పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్‌ను గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామపంచాయతీకి డిప్యూటేషన్‌పై పంపుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేయగా శుక్రవారం బయటికి వచ్చాయి. అదేవిధంగా గుర్రంపోడు మండలం పోచంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న జయకర్‌ను శాలిగౌరారం పంచాయతీ కార్యదర్శిగా డిప్యూటేషన్‌పై పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి చేస్తున్న అవినీతి, అక్రమాలతోపాటు ఆమె చూపుతున్న సామాజిక వివక్షను ప్రంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓ ప్రశ్నించినందుకే శాలిగౌరారం పంచాయతీ కార్యదర్శిపై డిప్యూటేషన్‌ వేటు వేశారని ఉద్యోగ, రాజకీయ, సామాజిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

శాలిగౌరారం ఇన్‌చార్జి ఎంపీడీఓగా రజిత

శాలిగౌరారం : శాలిగౌరారం ఇన్‌చార్జి ఎంపీడీఓగా నకిరేకల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీఓగా విధులు నిర్వర్తిస్తున్న జె.రజిత నియమితులయ్యారు. ఈ మేరకు జెడ్పీ సీఈఓ ఎన్‌.ప్రేమ్‌కరణ్‌రెడ్డి శుక్రవారం శాలిగౌరారం ఎంపీడీఓగా రజితకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాలిగౌ రారం ఎంపీడీఓ జ్యోతిలక్ష్మిపై అవినీతి ఆరోపణలు రావడంతో రెండు రోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి శుక్రవారం నుంచి సెలవుపై వెళ్లడంతో ఆమె స్థానంలో రజితకు ఎంపీడీఓగా బాధ్యతలు అప్పగించారు.

బైపాస్‌ నిర్మాణంలో లోపాలను సరిదిద్దాలి

నల్లగొండ టూటౌన్‌ : పానగల్‌ బైపాస్‌ నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు నేషనల్‌ హైవే అథారిటీ అధికారులే గుర్తించారని, వీటిని వెంటనే సరిదిద్దాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. నాణ్యత లేని మట్టితో హైవే నిర్మాణం చేపడుతున్నారని తాను చేసిన ఫిర్యాదుతో శుక్రవారం నల్లగొండకు వచ్చిన జాతీయ రహదారుల అథారిటీ చీఫ్‌ ఇంజనీర్‌ ధర్మారెడ్డి, రీజినల్‌ ఆఫీసర్‌ కృష్ణప్రసాద్‌తో పాటు పలువురు అధికారులతో కలిసి ఆయన రోడ్డు పనులను పరిశీలించి మాట్లాడారు. అధికారులు శాంపిల్స్‌ సేకరించినట్లు వర్షిత్‌రెడ్డి తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కళ్లముందే రోడ్డు నిర్మాణం నాణ్యత లేకుండా జరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. శాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని జాతీయ రహదారి అథారిటీ అధికారులు తెలిపినట్లు చెప్పారు. నాగం వెంట బీజేపీ సీనియర్‌ నాయకులు పోతెపాక సాంబయ్య తదితరులు ఉన్నారు.

పాలిసెట్‌కు ఉచిత శిక్షణ

రామగిరి (నల్లగొండ) : పాలిసెట్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఈనెల 20 నుంచి మే 11 వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నల్లగొండ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సీహెచ్‌.నరసింహారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. మే నెల 13న జరిగే పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థుల కోసం నల్లగొండ ప్రభు త్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 18, 19 తేదీల్లో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement