నల్లగొండ : కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున యాసంగి ధాన్యం వస్తున్నందున మిల్లర్లు జాప్యం చేయకుండా అన్‌లోడ్ చేసుకోవాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రైస్ మిల్లర్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని, మరో 15 రోజుల్లో మరో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, తాలు, లారీలు తదితర కారణాలతో ఎలాంటి కొర్రీలు పెట్టవద్దన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి నోటిఫైడ్ లారీలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ను ఆదేశించారు. మిల్లర్ల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, బ్యాంకు గ్యారంటీ, మిల్లర్ అగ్రిమెంట్ సమర్పించని మిల్లర్లు వెంటనే అవి ఇవ్వాలని తెలిపారు. ఇప్పటివరకు మిల్లుల వారీగా దిగుమతి చేసుకున్న ధాన్యం వివరాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా పౌర సరఫరాల అధికారిని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల జిల్లా అధికారులు వెంకటేశం, రాంపతినాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, డీఆర్‌డీఓ శేఖర్ రెడ్డి, డీసీఓ పత్యానాయక్, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


