కొత్తగా సూర్యాపేట లోక్‌సభ స్థానం
భువనగిరిలో..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో కొత్తగా పార్లమెంట్ స్థానం ఏర్పాటుపై చర్చ కొనసాగుతోంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలతో కొత్త నియోజకవర్గం ఏర్పాట య్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దానిని జిల్లా కేంద్రమైన సూర్యాపేట కేంద్రంగానే ఏర్పాటు చేసే అంశంపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఆరు అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి కొత్త జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల చొప్పున ఏర్పాటయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా మొత్తంగా ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 12 నుంచి 18కి చేరనుండగా, ఖమ్మం, వరంగల్‌లోని మూడు స్థానాలను కలపుకొని కొత్త లోక్‌సభ స్థానాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రాజకీయ వర్గాల విశ్లేషణ
కేంద్ర ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను పెంచేందుకు బిల్లును రూపొందించింది. దీంతో ఉమ్మడి జిల్లాలోనూ నియోజకవర్గాల పునర్విభజనపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలు ఉండగా, పునర్విభజన అనంతరం సూర్యాపేట కేంద్రంగా మూడో లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటు కానుందనే విశ్లేషణ రాజకీయవర్గాల్లో సాగుతోంది. మరోవైపు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రెండేసి చొప్పున కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
మారనున్న లోక్‌సభ స్థానాల పరిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే స్థానంతోపాటు ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల పరిధులు మారే అవకాశం ఉంది. మరోవైపు నల్లగొండ పార్లమెంట్ స్థానంలో నల్లగొండ జిల్లాలోని అసెంబ్లీ స్థానాలతోనే సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఇక సూర్యాపేట జిల్లాలోని అసెంబ్లీ స్థానాలతోపాటు సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసే అసెంబ్లీ స్థానాలు, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని రెండు నియోజకవర్గాలను కలుపుకొని కొత్త నియోజకవర్గాన్ని ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది.
ప్రస్తుతం నల్లగొండ లోక్‌సభ పరిధిలో కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలున్నాయి. ఇవి కాకుండా నల్లగొండలో నల్లగొండ అర్బన్, రూరల్ నియోజకవర్గాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. నల్లగొండ పట్టణంతోపాటు రూరల్ మండలం కలుపుకుని నల్లగొండ అర్బన్ నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారనే చర్చ ఉంది. మరోవైపు కనగల్, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాలతో నల్లగొండ రూరల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేయవచ్చనే చర్చ సాగుతోంది. ఇక మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌లోని కొన్ని మండలాలలను కలుపుకొని మరో నియోజకవర్గం ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే ఆ కొత్త నియోజకవర్గంతోపాటు నల్లగొండ అర్బన్, నల్లగొండ రూరల్, మిర్యాలగూడ, నకిరేకల్, నాగార్జునసాగర్, దేవరకొండతో నల్లగొండ లోక్‌సభ స్థానాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
సూర్యాపేటలోనూ అర్బన్ నియోజకవర్గం
ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట టౌన్‌తో పాటు రూరల్ మండలాన్ని కలుపుకొని సూర్యాపేట అర్బన్ నియోజకవర్గంగా, సూర్యాపేట రూరల్ నియోజకవర్గాన్ని ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్‌పహాడ్, ప్రస్తుతం కోదాడలోని మోతె మండలాలను కలుపుతూ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తుంగతుర్తి నియోజవర్గంలోని నాగారాన్ని కూడా నియోజక వర్గం చేస్తారనే చర్చ జరుగుతోంది. దీంతో కొత్తగా ఏర్పాటు చేయబోయే సూర్యాపేట లోక్‌సభ పరిధిలోకి సూర్యాపేట, హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తి, నాగారం, వరంగల్, ఖమ్మం జిల్లాలోని అసెంబ్లీ స్థానాలతో సూర్యాపేట లోక్‌సభ స్థానం ఏర్పడొచ్చన్న చర్చ సాగుతోంది.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఫ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలతో నూతన నియోజకవర్గం
ఫ సూర్యాపేట కేంద్రంగా ఏర్పడే అవకాశం
ఫ ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఆరు అసెంబ్లీ స్థానాలు
ఫ ప్రతి జిల్లాలో రెండుచొప్పున ఏర్పాటు
రాష్ట్రంలో కొత్తగా 9 లోక్‌సభ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడున్న 17 స్థానాలు 26కు పెరుగనున్నాయి. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఐదు, దక్షిణ తెలంగాణలో రెండు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రెండు లోక్ సభస్థానాలు పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దక్షిణ తెలంగాణలో ఒకటి సూర్యాపేట కేంద్రంగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
భువనగిరి లోక్‌సభ పరిధిలో ఉమ్మడి జిల్లాలోని తుంగతుర్తి, నకిరేకల్, ఆలేరు, భువనగిరి, మునుగోడు, ఉమ్మడి వరంగల్‌లోని జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఉన్నాయి. భువనగిరి పరిధిలోనుంచి ఆ రెండింటిని తొలగించి కొత్తగా ఏర్పాటు చేసే అసెంబ్లీ స్థానాలతోనే సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మోత్కూరు, అడ్డగూడురు, ఆత్మకూరు, గుండాల, వలిగొండ మండలాలతో మోత్కూరును అసెంబ్లీ నియోజకవర్గంగా చేస్తారన్న చర్చ సాగుతోంది. చౌటుప్పల్, నారాయణపూర్, పోచంపల్లి, రామన్నపేట కలుపుకొని చౌటుప్పల్ లేదా రామన్నపేటను నియోజకవర్గం చేసే అవకాశం ఉంది. దీంతో వాటిని భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది.


