కొందరి నిర్వాకం ఇలా..
నల్లగొండ టూటౌన్ : నీలగిరి నగర విస్తరణ, అభివృద్ధికి తగ్గట్టుగా కార్పొరేషన్ ఆదాయం పెరగడం లేదు. నగరంలో శివారు కాలనీలు పెరగడంతో పాటు ఆయా కాలనీల్లో ఐదారు అంతస్తుల భవన నిర్మిస్తున్నారు. వీటికితోడు ఇటీవల కాలంలో షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ఆస్పత్రులు భారీగా వెలిశాయి. దీంతో కార్పొరేషన్ సేవలతోపాటు కార్పొరేషన్‌కు ఖర్చులు కూడా భారీగానే పెరిగిపోయాయి. కానీ దానికి తగ్గట్టుగా ఆస్తి పన్ను వసూలు కావడంలేదని, తద్వారా ఆదాయం అంతంత మాత్రంగానే సమకూరుతుందనే చర్చ కొనసాగుతోంది.
నగరంలో 44 వేల భవనాలు..
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48 వార్డుల్లో 44 వేలకుపైగానే భవనాలకు ఇంటి నంబర్లు ఉన్నాయి. ఈ భవనాల ద్వారా అనుకున్న స్థాయిలో ఆస్తి పన్ను ద్వారా ఆదాయం సమకూరడంలేదు. గత కొన్నేళ్లుగా మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆస్తి పన్ను ద్వారా కచ్చితంగా రావాల్సిన ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. 44వేల భవనాలకు దాదాపుగా రూ.30 కోట్ల వరకు ఆస్తి పన్ను ద్వారా ఆదాయం రావాల్సి ఉంది. కానీ ప్రసుతం ఆస్తి పన్ను ద్వారా రూ.18 కోట్లు మాత్రమే వస్తుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సేవలందిస్తున్న కార్పొరేషన్ అదే స్థాయిలో ఆదాయం కూడా రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్పొరేషన్‌కు ఇటీవల కొత్తగా జేసీబీలు, ర్యాడర్, ఇతర వాహణాల కొనుగోలు చేయడం, వాటి నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. పెరిగిన ఖర్చులకు ఆదాయం పెంచుకునే దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
యంత్రాంగం దృష్టి సారిస్తే మేలు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నీలగిరి నగరంలోని వాణిజ్య సముదాయాలు, షాపింగ్ కాంప్లెంక్స్‌లు, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ ఆసుపత్రులు, కార్ల షోరూంల భవనాలను రీ మదింపు (అసెస్‌మెంట్) చేస్తే ఆస్తి పన్ను రూ.18 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కార్పొరేషన్ యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
నాలుగైదు అంతస్తుల భవనాలు ఉన్నవారిలో కొందరు ఒక అంతస్తుకు, రెండస్తులకు మాత్రమే ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ రోడ్‌లో ఓ బైక్ షోరూం భవనం ఐదు అంతస్తులు ఉండగా కేవలం రూ.10 వేలు మాత్రమే ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. అదేవిధగాం ఇదే రోడ్‌లో మరో బైక్ షోరూం వారు అన్ని అంతస్తులకు చెల్లించకుండా మూడు అంతస్తులకు రూ.లక్ష మాత్రమే వస్తుంది. ఆయా బైక్ షోరూం భవనాలకు ఏడాదికి వాస్తవ ఆస్తి పన్ను రూ.3 లక్షల వరకు ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా బోయవాడలోని ఓ ప్రైవేట్ స్కూల్ ఐదంతస్తుల భవనం ఉండగా కేవలం రెండంతస్తులకే ఆస్తిపన్ను చెల్లిస్తున్నట్లు తెలిసింది. రామాలయం సమీపంలోని ఓ కార్పొరేట్ మాల్ భవనం, దానికి సమీపంలోనే ఉన్న మరో షాపింగ్ కాంప్లెక్స్, ఎన్జీ కాలేజీ సమీపంలో ఉన్న ఓ మాల్ భవనం, ఎల్‌వీ బంక్ సమీపంలో ఉన్న మరో రెండు భవనాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందున రెట్టింపు ఆస్తి పన్ను వేసే అవకాశం ఉంటుంది. ఇలా ఒక్కటి రెండు కాదు కార్పొరేట్ మాల్స్, పాత భవనాల స్థానంలో కొత్తగా నిర్మించిన దుకాణాలకు రీ మదింపు చేసే దిశగా కార్పొరేషన్ యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది.
ఫ నీలగిరి కార్పొరేషన్ ఆదాయం పెరగట్లే..!
ఫ వసూలు కావాల్సిన ఆస్తి పన్ను రూ.30 కోట్లు
ఫ 44 వేల భవనాలున్నా.. రూ.18 కోట్లే వసూలు
ఫ మళ్లీ మదింపు చేస్తేనే దండిగా ఆదాయం


