2022లో పింఛన్ కోసం వచ్చిన 300 మంది దివ్యాంగుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వారంతా సదరం సర్టిపికెట్లతో దరఖాస్తు చేసుకున్నా చిన్నచిన్న పొరపాట్ల కారణంగా అవి తిరస్కరణకు గురైనట్లు తెలిసింది. ఆ తర్వాత వాటిని సరిచేసుకున్నా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో అనేక మంది దివ్యాంగులు కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌కు వస్తూనే ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆసరా పింఛన్ల కోసం అర్హులకు ఎదురుచూపులు తప్పడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ ఆప్షన్‌ను కూడా ప్రభుత్వం నాలుగేళ్లుగా బంద్ చేసింది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ హామీ మాట దేవుడెరుగు అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నాటికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. దీంతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.
2022 ఆగస్టు నుంచి ఆగిన ‘ఆసరా’
రాష్ట్ర వ్యాప్తంగా 2022 ఆగస్టు నుంచి కొత్తగా ఆసరా పింఛన్ల మంజూరును ప్రభుత్వం నిలిపివేసింది. అప్పటికే జిల్లాలో చాలామంది దరఖాస్తు చేసుకున్నా వివిధ కారణాలతో వాటిని తిరస్కరిచింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే పోర్టల్‌ను క్లోజ్ చేయడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో నాలుగేళ్ల నుంచి దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు అధికారులకు నేరుగా దరఖాస్తులు ఇస్తున్నారు తప్ప.. మంజూరు కావడం లేదు. ఇలా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలోనే ఆరు వేల మందికిపైగా ప్రజలు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మండల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అర్హులైన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు.
ఎన్నికల హామీ నెరవేరుతుందా..!
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా ఇప్పటి వరకు అమలు కాలేదు. ఎన్నికల హామీలో భాగంగా పింఛన్ల పెంపును అమలు చేయడంతో పాటు కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు అందిస్తారని కోటి ఆశలతో ఉన్నారు. ప్రభుత్వం తప్పకుండా పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఫ నాలుగేళ్లుగా ఎదురుచూపులు
ఫ 2022 నుంచి నిలిచిన కొత్త పింఛన్ల మంజూరు
ఫ పోర్టల్‌ను పూర్తిగా మూసేసిన ప్రభుత్వం
ఫ వచ్చిన దరఖాస్తులను కూడా ఆన్‌లైన్ చేయలేని పరిస్థితి
ఫ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న అర్హులు
ఫ జూన్‌లో ఇస్తామని ప్రభుత్వ ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు
జిల్లాలో ప్రస్తుతం పింఛన్ల వివరాలు
వృద్ధాప్య 70,031
దివ్యాంగ 29,830
వితంతు 77,620
చేనేత 2,836
గీత కార్మిక 7,553
ఒంటరి మహిళ 7,498
మొత్తం 1,95,368


