నల్లగొండ టౌన్ : భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సమరశీల రైతాంగ ఉద్యమాలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండలోని ఏచూరి గార్డెన్‌లో రైతు సంఘం నల్లగొండ జిల్లా 24వ మహాసభలో వారు మాట్లాడారు. పండించిన పంటలకు మద్దతు ధరల చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్న కాంగ్రెస్ హామీ నెరవేరలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోలు యాప్, యూరియా అమ్మకం యాప్‌లు తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. పండించిన ప్రతి గింజకూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వి.వెంకటేశ్వర్లు, బండా శ్రీశైలం, కందాల ప్రమీల, దేవిరెడ్డి అశోక్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, మల్లయ్య, కత్తి శ్రీనివాస్‌రెడ్డి, అయితరాజు నరసింహ, మారయ్య, ముత్తిలింగం, నలపరాజు సైదులు, నర్సిరెడ్డి, జానయ్య తదితరులు పాల్గొన్నారు.


