మిర్యాలగూడ టౌన్ : బైక్‌పై వెళ్తున్న వ్యక్తి యూటర్న్ తీసుకుంటుండగా కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామంలో ఆది వారం రాత్రి జరిగింది. సోమవారం మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగపాడు గ్రామానికి చెందిన పగడాల మధుసూదన్ (36) ఆదివారం రాత్రి బైక్‌పై గ్రామంలోని కిరాణ దుకాణానికి వెళ్లి సరుకులు తీసుకుని తిరిగి ఇంటికి వస్తూ.. జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై యూట ర్న్ తీసుకుంటుండగా త్రిపురారం నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుసూదన్‌కు తీవ్ర గాయాలు కాగా మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. సోమవారం మృతుడి భార్య పగడాల సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
చికిత్స పొందుతూ మృతి
చందంపేట : ఓ వ్యక్తితో ఘర్షణలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. వివరాలు.. నేరెడుగొమ్ము మండలం జోడుబాయితండాకు చెందిన కేతావత్ లచ్చు(30) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో కూలీ పనితో పాటు ఊళ్లో చిన్న కిరాణ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం క్రితం అదే గ్రామానికి చెందిన కేతావత్ శ్రీకాంత్‌తో లచ్చుకు ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో శ్రీకాంత్ కర్రతో దాడి చేయగా లచ్చు, అతడి భార్య అరుణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం లచ్చును నల్లగొండ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగేంద్రబాబు తెలిపారు. ఈ ఘటనతో జోడుబాయితండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ బీసన్న ఆధ్వర్యంలో చందంపేట ఎస్‌ఐ లోకేష్, డిండి ఎస్‌ఐ బాలకృష్ణ, నేరెడుగొమ్ము ఎస్‌ఐ నాగేంద్రబాబు, నాంపల్లి, మర్రిగూడ ఎస్‌ఐలు, దేవరకొండ సీఐ వెంకట్‌రెడ్డి బందోబస్తు చేపట్టారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులో జైలుశిక్ష
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఐదుగురిని సోమవారం సూర్యాపేట కోర్టులో హాజరుపర్చినట్లు ట్రాఫిక్ ఎస్‌ఐ సాయిరాం తెలిపారు. వారిలో ఒకరికి రెండు రోజుల జైలుశిక్ష,, రూ.2300 జరిమానా, మరో నలుగురికి కలిపి రూ.4 వేలు జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ గోపు రజిత తీర్పు వెలువరించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


