పెద్దవూర: ట్రాక్టర్ చోరీ చేసిన నిందితులను పెద్దవూర పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సాగర్ సీఐ శ్రీనునాయక్, పెద్దవూర ఎస్‌ఐ వై. ప్రసాద్‌తో విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన దున్న శ్రీను గత రెండేళ్ల నుంచి పెద్దవూర మండలం పోతునూరు గ్రామ శివారులో దొడ్డి నర్సింహారావు పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గత నెల 12న దున్న శ్రీను ట్రాక్టర్‌తో పొలం దున్ని దానిని అక్కడే వదిలి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి చూడగా ట్రాక్టర్ కనిపించలేదు. దీంతో పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సోమవారం పెద్దవూర ఎస్‌ఐ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి మండలంలోని పొట్టిచెల్మ వై జంక్షన్ సమ్మక్క–సారలమ్మ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుముల గ్రామానికి చెందిన మంద శంకర్, కావేటి భరత్ ట్రాక్టర్‌పై హాలియా నుంచి సాగర్ వైపు వెళ్తుండగా ఆపారు. ట్రాక్టర్‌కు సంబంధించిన పత్రాలు చూపించాలని కోరగా అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పోతునూరు సమీపంలో పొలంలో ఉన్న ట్రాక్టర్‌ను చోరీ చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి ట్రాక్టర్, బైక్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను నిడమనూరు కోర్టులో రిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు.


