హయత్‌నగర్ : నష్టాల్లో ఉన్న నల్లగొండ–రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం(నార్ముల్– మదర్ డెయిరీ)కి పూర్వ వైభవం తీసుకొస్తామని, రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని మదర్ డెయిరీ కార్యాలయంలో ఆయన డైరెక్టర్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మదర్ డెయిరీలో నెలకొన్న సరిస్థితులను, పదేళ్లుగా వస్తున్న నష్టాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించామని, సమస్యల పరిష్కారానికి తగిన సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మదర్ డెయిరీ మాక్స్ చట్టం పరిధిలో ఉన్నందున ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వలేమని, ఎన్‌డీడీబీ (నేషనల్ డెయిరీ డవలప్‌మెంట్ బోర్డు)తో ఒప్పందం కుదిర్చేందుకు కృషిచేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, రాష్ట్ర డెయిరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, నార్ముల్ ప్రతినిధి సామ మహిపాల్‌రెడ్డితో కూడిన బృందం ఎన్‌డీడీబీ ప్రతినిధులతో చర్చించినట్లు వెల్లడించారు. రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు తక్షణ సహాయంగా రూ.10 కోట్లు ఇచ్చేందుకు ఎన్‌డీడీబీ అంగీకరించిందన్నారు. పాల సేకరణను మదర్ డెయిరీ పాలకవర్గం చూసుకోవాలని, ఉత్పత్తుల విక్రయాలు, మార్కెటింగ్ ఎన్‌డీడీబీ చూసుకునేలా ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. మదర్ డెయిరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎండీ కాటెపల్లి లింగారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
చైర్మన్ మధుసూదన్‌రెడ్డి


