పశుసంవర్ధక శాఖలో ఫెస్ రికగ్నిషన్ హాజరు
నల్లగొండ అగ్రికల్చర్ : పశు సంవర్ధక శాఖలో ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించి వినియోగంలోకి తేనున్నారు. పశు సంవర్ధక శాఖలో ఇప్పటి వరకు రిజిస్టర్‌లోనే సంతకాలు చేసే విధానం అమల్లో ఉంది. దీంతో కార్యాలయాలకు, ఆసుపత్రులకు అధికారులు, వైద్యులు, సిబ్బంది సరిగ్గా హాజరు కావడం లేదని మూగ జీవాలకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల బినామీలు పని చేస్తున్నారని అర్హత లేని వారు మూగ జీవాలకు వైద్యం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి వెంటనే ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలలో ఈ విధానం అమలు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.
మొబైల్‌లో ఫొటోతో హాజరు..
ఫేస్ రికగ్నిషన్ హాజరు కోసం జిల్లా పశు వైద్య సంవర్ధక శాఖలో పని చేసే వైద్యులు సిబ్బంది, అధికారులు వారు పనిచేసే చోటనే స్మార్ట్ ఫోన్‌లో ఫొటో దిగి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఉదయం, సాయంత్రం హాజరు నమోదు చేసుకోవాలి. ప్రాంతంలో ఉండి ఫొటో అప్‌లోడ్ చేస్తే యాప్‌లో నమోదు కాదు.
350 మంది ఉద్యోగులు..
జిల్లా వ్యాప్తంగా ఒక బహుళార్ధక పశు వైద్యశాల, నకిరేకల్, చండూరు, దేవరకొండ, నిడమనూరు, మిర్యాలగూడ ప్రాంతాల్లో ఏరియా పశు వైద్యశాలలు, 56 ప్రాథమిక పశు వైద్యశాలలు, 59 గ్రామీణ వైద్యశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 350 మంది వివిధ హోదాల్లో చేస్తున్నారు. వీరు మార్చి మొదటి వారం నుంచి ఫేస్ రికగ్నిషన్ హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.


