బాధితురాలా? నిందితురాలా?
ఇన్ని లోపాలకు కారణమైన వారిపై చర్యలు చేపట్టకుండా ప్రశ్నపత్రం ఫొటో తీసుకునేందుకు సహకరించిందంటూ బాలిక ఝాన్సీలక్ష్మిని డిబార్ చేయడం అనేక విమర్శలకు తావిస్తోంది. ప్రతిభావంతులైన పిల్లలు కూడా పదో తరగతి పరీక్షలు అంటేనే భయపడతారు. పరీక్ష కేంద్రంలోకి వచ్చాక ఎలా రాయాలన్న ఆందోళనలోనే ఉంటారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి రాయితో కొడతానని బెదిరించి ప్రశ్నపత్రం ఫొటో తీసుకుంటే అందుకు బాలిక సహకరించినట్టా? విద్యార్థిని నుంచి ఫొటో తీసుకొని వెళ్లి, జవాబులను మళ్లీ ఆమెకు తెచ్చి ఇచ్చారా? ఈ విషయం విద్యాశాఖ అధికారులే చెప్పాలి. ఆ బాలిక బాధితురాలా? నిందితురాలా? అన్నది తేల్చాల్సి ఉంది. ఇవేమీ చెప్పకుండా, అసలు భద్రతాలోపం, పర్యవేక్షణ వైఫల్యాలకు కారణమైన వారిపై చర్యలు చేపట్టకుండా, ఆ బాలికను డిబార్ చేయడంపై విద్యార్థిని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పైగా ఈ సంఘటన జరిగిన నాలుగు రోజులకు (సోమవారం) మండల విద్యాధికారి ఈ సంఘటనపై ప్రకటన జారీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఫ విద్యా, పోలీసు, రెవెన్యూ శాఖల వైఫల్యమే కారణమా!
ఫ ప్రశ్నపత్రం ఫొటో తీసుకునేందుకు సహకరించిందంటూ బాలిక డిబార్
ఫ మరి.. బయటి వ్యక్తి పరీక్ష కేంద్రంలోని రావడానికి కారణమైన వారిపై చర్యలేవీ?
ఫ అనుమానాలకు తావిస్తోన్న అధికారుల తీరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పదో తరగతి తెలుగు పేపరు–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానికి అసలు బాధ్యులు ఎవరు? ఎవరిని బలి చేశారన్న చర్చ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈనెల 21వ తేదీన ఉదయం లీకై న తెలుగు ప్రశ్నపత్రం శాలిగౌరారంలో యువకుల వాట్సాప్‌లలో సర్క్యూలేట్ అయ్యేంత వరకు ప్రశ్నపత్రం బయటకు వచ్చిన విషయాన్ని అధికారులు గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విద్యాశాఖ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం, భద్రతా వైఫల్యమే ప్రశ్నపత్రం లీకేజీకి కారణమనే చర్చ సాగుతోంది. పైగా ప్రశ్నపత్రం ఫొటో తీసుకునేందుకు సహకరించిందంటూ విద్యార్థిని ఝాన్సీలక్ష్మిని డిబార్ చేయడం అనేక విమర్శలకు కారణం అవుతోంది.
గోడ దూకి ఎలా వచ్చాడు?
సాధారణంగానే టెన్త్, ఇంటర్ పరీక్షల సమయంలో 144 సెక్షన్‌ను విధిస్తారు. పరీక్ష కేంద్రం పరిసరాల్లో ఇది అమల్లో ఉంటుంది. ఆ సమయంలో బయటి వ్యక్తి ఒకరు పాఠశాల ప్రహరిగోడ దూకి ఆవరణలోని వచ్చారంటే భద్రత వైఫల్యమే కారణమనే చర్చ సాగుతోంది. అంతేకాదు సదరు వ్యక్తి తరగతి గది వరకు వచ్చి మరీ కిటికీలోనుంచి విద్యార్థిని ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని వెళ్లాడంటే లోపం ఎక్కడుందన్న విషయాన్ని విచారణలో పట్టించుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు స్థానిక పోలీసులు ఈ పరీక్షలకు సీరియస్‌గా తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం ఒకరిద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తుకు ఉంచినట్లుగా తెలుస్తోంది. భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలం అయ్యారని, ఆ విషయాన్ని పక్కన పెట్టి విచారణ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పరీక్ష కేంద్రం వద్ద పోలీసు భద్రత పటిష్టంగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జిరాక్స్ కేంద్రాలు ఎలా తెరిచారు?
పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాన్ని సెల్‌ఫోన్‌తో ఫొటో తీయగా, అందులోని ప్రశ్నలకు అనుగుణంగా ఒకే పేపరులో వచ్చేలా జవాబులను సిద్ధం చేసి స్థానికంగా జిరాక్స్ తీశారు. పరీక్షలు సమయంలో అంతటా జిరాక్స్ సెంటర్లను మూసేస్తారు. కానీ నకిరేకల్, శాలిగౌరారంలో జిరాక్స్ కేంద్రాలు ఎలా తెరిచి ఉంచారు? దానికి బాధ్యులు ఎవరన్నది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
నకిరేకల్ : ‘పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీలో నాకు ఏ పాపం తెలియదు.. నన్న డిబార్ చేశారు. నాకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలి. లేకుంటే నాకు చావే శరణ్యం’ అని పదో తరగతి విద్యార్థిని బల్లెం ఝాన్సీలక్ష్మి తన ఆవేదన వెలిబుచ్చిది. నకిరేకల్‌లో ఈ నెల 21 పదో తరగతి తెలుగు పేపర్ లీకై .. ప్రశ్నపత్రం వాట్సప్‌లలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రమేయం ఉందంటూ.. అధికారులు విద్యార్థిని ఝాన్సీలక్ష్మిని డిబార్ చేశారు. ఇప్పుడు ఆ విద్యార్థినిని మిగతా పరీక్షలకు అనుమతించడం లేదు. దీంతో ఆమె సోమవారం తన తల్లిదండ్రుల వెంకన్న, శోభతో కలిసి విలేకరుల ముందు తన గోడును వెల్లబోసుకుంది. తాను నకిరేకల్‌లోని శ్రీకృష్ణవేణి పాఠశాలలో నర్సరీ నుంచి పదో తరగతి వరకు చదువుకున్నానని, తాను క్లాస్‌లో టాపర్‌నని చెప్పింది. తీరా పది పరీక్షలు రాస్తున్న తరుణంలో ఎవరో ఆకతాయిలు తాను పరీక్ష రాస్తున్న గది వద్దకు తనను బెదిరించి ప్రశ్నపత్రం ఫొటోలు తీసుకున్నారని చెప్పింది. పేపర్ చూపించకుంటే రాయితో కొడతామని బెదిరించారని, ఆ సమయంలో భయపడి ప్రశ్నపత్రం చూపించానని, తన పక్కన ఉన్న విద్యార్థులు కూడా ఏం కాదులే చూపించు అన్నారని పేర్కొంది. పేపర్ ఫొటో తీసేందుకు సహకరించాననే ఆరోపణలతో తనను అధికారులు డీబార్ చేశారని చెప్పింది. ‘నా డిబార్‌ను రద్దు చేయండి.. నన్ను ఏ సెంటర్‌లోనైనా కూర్చోబెట్టి పరీక్ష రాయించినా.. రాస్తాను. ఎవరో చేసిన దానికి నన్ను బలిచేశారు. దయచేసి నాకు పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వండి’ అని ఝాన్సీలక్ష్మి వేడుకుంది. పరీక్షలకు అనుమతివ్వకపోతే చావే శరణ్యమని కన్నీటిపర్యంతమైంది. జిల్లా విద్యాధికారులు, పోలీసులు మానవత్వంతో కనికరించి తనకు అవకాశం ఇవ్వాలని కోరింది.
నన్ను అన్యాయంగా డిబార్ చేశారు
ఫ పరీక్ష రాసే అవకాశం ఇవ్వండి
ఫ విద్యార్థిని ఝాన్సీలక్ష్మి
ప్రశ్నపత్రం లీకేజీలో ఎవరి పాత్ర ఎంత?