వీ బీ జీ రామ్‌జీ చట్టానికి వ్యతిరేకంగా గ్రామసభలు
● డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్
నల్లగొండ : కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న వీ బీ జీ రామ్‌జీ చట్టాన్ని వ్యతిరేకిస్తు ఈ నెల 20 నుంచి 30 వరకు గ్రామసభలు నిర్వహించి.. ఆ చట్టానికి వ్యతిరేకంగా తీర్మాణాలు చేయాలని నిర్ణయించామని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్ తెలిపారు. శనివారం నల్లగొండలోని యాదవ సంఘం భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని మార్చి పేదలకు మరణ శాసనం రాసిందని ధ్వజమెత్తారు. కొత్తగా తీసుకొచ్చిన వీబీజీరామ్‌జీ చట్టంలో పని దినాలు పెరిగినా కూలీలకు ప్రయోజనం లేదన్నారు. పనులు దొరక్క ప్రజలు.. పట్టణాలకు పోతే గ్రామాల్లో ఉన్న ఆస్తులను కార్పొరేట్లకు అప్పచెప్పాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పాత ఉపాధి హామి చట్టం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొత్తగా తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా జిల్లాలో ఫిబ్రవరి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని.. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీను, ఎండీ.ముంతాజ్ అలీ, కన్నారావు, వెంకటయ్య, గౌతమ్, శివ, వెంకట్‌గౌడ్ పాల్గొన్నారు.


