చిరునామా ఆధారం
12న వార్డుల వారీగా ఓటరు జాబితా
నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లోని ఇటీవల అధికారులు ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 9న ముగిసింది. వార్డుల వారీగా రాజకీయ పార్టీలు, స్థానిక ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలపై మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పరిశీలిన ప్రారంభించారు. పరిశీలన పూర్తిచేసి చిరునామా ఆధారంగా తుది ఓటరు జాబితాను తయారు చేయనున్నారు.
ఫిర్యాదులను క్రోడీకరించి..
వార్డుల్లో ఓటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు క్రోడీకరించి వార్డుల హద్దులు, కాలనీల్లో ఉన్న ఓటర్లు, ఓటరు కార్డుపై ఉన్న చిరునామా ఆధారంగా పరిశీలిస్తున్నారు. పరిశీలన పూర్తి చేసి ఈ నెల 12న వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు సిద్ధమవుతున్నారు. 13న పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రదర్శిస్తారు. దాంతో పాటు టీ పోల్ యాప్‌లో జాబితాను అప్‌లోడ్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. 16న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.
నీలగిరిలో అధికారిక ఆదేశాలు అందితేనే..
నీలగిరి కార్పొరేషన్ ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. ఎన్నికల ప్రక్రియ కోసం కసరత్తు పూర్తి చేయాలని ఆదేశించిన అధికారులు తుది ఓటరు జాబితాను ప్రదర్శించకుండా నిలిపివేయాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. నీలగిరి కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందిన విషయం విదితమే. ఈ బిల్లు రాష్ట్ర గవర్నర్ వద్దకు చేరగా గెజిట్ విడుదల కావాల్సి ఉంది. ఈ నెల 12 లేదా 13న గవర్నర్ నుంచి గెజిట్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఒక వేళ జాప్యం జరిగితే సంక్రాంతి తరువాత విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అందుకే మున్సిపల్ ఉన్నతాధికారులు తుది ఓటరు జాబితా ప్రకటనను నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా ఆదేశాలు రాకపోవడంతో ఎన్నికల కమిషనర్ ఆదేశాల ప్రకారమే ఓటరు జాబితా రూపొందించే పనులను అధికారులు చేస్తున్నారు.
ఫ మున్సిపాలిటీల్లో ఓటరు తుది జాబితా రూపకల్పన
ఫ ముగిసిన అభ్యంతరాల స్వీకరణ
ఫ 16న ఫొటోలతో కూడిన ఓటరు తుది జాబితా ప్రకటన
ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఓటరు జాబితాకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తున్నాం. ఈ నెల 12న వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటరు జాబితాను ప్రదర్శిస్తాం. ఎన్నికల నిబంధనల ప్రకరమే ఓటరు జాబితాను ప్రచురిస్తున్నాం.
– సయ్యద్ ముసాబ్ అహ్మద్,
మున్సిపల్ కమిషనర్, నల్లగొండ


