కోదాడరూరల్: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ మండలం గుడిబండ శివారులో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం శాంతినగర్‌కు చెందిన తల్లోజు దుర్గాచారి(29) కోదాడ పట్టణంలోని హిందూజా కంపెనీలో పనిచేస్తున్నాడు. పనిలో భాగంగా గురువారం బైక్‌పై కోదాడ నుంచి మేళ్లచెర్వు వెళ్తుండగా కోదాడ మండలం గుడిబండ గ్రామ శివారులో కాపుగల్లు క్రాస్‌రోడ్‌లో ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. దుర్గాచారికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. మృతుడి తండ్రి పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జూదరుల అరెస్ట్
అనంతగిరి: మండల పరిధిలోని ఖానాపురం శివారులో పేకాట ఆడుతున్న వారిని అనంతగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం గ్రామ శివారులో కొందరు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఖానాపురం గ్రామానికి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారి నుంచి రూ.1430 నగదు. రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
350 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలో అక్రమంగా బ్లాసింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఎస్‌ఓటీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని 350 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారనే సమాచారంతో బ్లాస్టింగ్ చేసే ప్రదేశంలో అతడిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు ఎస్‌ఓటీ పోలీసులు వెలడించారు. అక్రమ బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు.