డీఎల్‌ఐ భూసేకరణ త్వరితగతిన పూర్తిచేయాలి
డిండి: డిండి ఎత్తిపోతల పథకం (డీఎల్‌ఐ) లో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ల నిర్మాణానికి భూ సేకరణ, పునరావాస సమస్యలను అధిగమించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం డిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టును సందర్శించిన అనంతరం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై నీటి పారుదల శాఖ అతిథి గృహంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ ఈఈలు డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి నీటి తరలింపు, రిజర్వాయర్ల నిర్మాణ వివరాలను కలెక్టర్‌కు వివరించారు. 3లక్షల 41 వేల ఎకరాలకు సాగునీరందించే డిండి ప్రాజెక్టు పనులకు రూ. 6190 కోట్లు కేటాయించారని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ తదితర పనులకు ఇప్పటి వరకు రూ.4450 కోట్లు చెల్లింపులు జరిగాయని తెలిపారు. ప్రాజెక్టు పనులు 7 ప్యాకేజీలో జరుగుతున్నట్లు పేర్కొన్నారు. డిండి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను సర్పంచ్ రవి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు ఆయన స్పందిస్తూ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీఓ వెంకన్నకు సూచించారు. సమావేశంలో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


