షార్ట్ సర్క్యూట్‌తో ప్రింటింగ్ ప్రెస్ దగ్ధం
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మండల కేంద్రంలోని సమతా ప్రింటింగ్ ప్రెస్‌లో సోమవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ప్రింటింగ్ మిషన్లు, ప్రింటర్లు, కంప్యూటర్లు, కౌంటర్‌లో ఉన్న రూ.4500 కాలిబూడిదయ్యాయి. రూ.2లక్షల నష్టం వాటిల్లినట్లుదుకాణ యజమాని గుండు కిరణ్‌కుమార్ తెలిపారు.
ఇంట్లో సామగ్రి..
నార్కట్‌పల్లి : మండలంలోని మాధవఎడవెల్లి గ్రామానికి చెందిన ఎడమ మల్లేష్ ఇంట్లో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి సామగ్రి కాలిపోయాయి. ఇంట్లోని విద్యుత్ వైర్లకు మంటలు రావడంతో బీరువా, బీరువాలో ఉన్న విలువైన సర్టిఫికెట్లు, రూ.70 వేల నగదు, మంచం మీద సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు మల్లేష్ తెలిపారు.
వ్యక్తి కిడ్నాప్‌నకు యత్నం.. నలుగురిపై కేసు నమోదు
మోటకొండూర్ : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని బెదిరించి కారులో ఎక్కించుకెళ్లిన నలుగురిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన సోమవారం మోటకొండూర్ మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్‌ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ హజీమ్ తన భార్య షేక్ హసీనా బేగంతో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు బైక్‌ను ఆపి హజీమ్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. హజీమ్ భార్య హసీనా బేగం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. చౌటుప్పల్ సమీపంలో పోలీసులు కారును పట్టుకుని హజీమ్‌ను కిడ్నాప్ చేసిన పీసరి నవీన్‌రెడ్డి, పీసరి మల్లారెడ్డి, తుమ్మల వెంకట్‌రెడ్డి, ముత్తినేని సందీప్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు నలుగురిపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు..
చోరీ కేసులో ముగ్గురు రోహింగ్యాల అరెస్టు
రామగిరి(నల్లగొండ) : చోరీ కేసులో బర్మా దేశానికి చెందిన ముగ్గురు రోహింగ్యాలను నల్లగొండ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండ అడిషనల్ ఎస్పీ రమేష్ సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. బర్మా దేశానికి చెందిన రోహింగ్యాలు హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫిక్ ఆలం, మహ్మద్ ఇస్లాం, కమల్ హుస్సేన్, ఖైసర్, నూర్ ఖాసీం 2012లో ఇండియాకు శరణార్ధులుగా వచ్చి హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో నివసిస్తున్నారు. వీరు ఈ నెల 7న హైదరాబాద్ నుంచి వచ్చి నల్లగొండ పట్టణ సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న నిధి పాలిమర్ కంపెనీలో పైపుల తయారీకి వినియోగించే విలువైన వస్తువులను దొంగిలించి కంపెనీ దగ్గరలో చెట్ల పొదల్లో ఉంచి వెళ్లారు. హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, షఫిక్ ఆలం ఆదివారం అర్ధరాత్రి నల్ల గొండకు వచ్చి దొంగిలించిన వస్తువులను ఆటోలో తరలిస్తుండగా.. చర్లపల్లి శివారులో టూటౌన్ సీఐ రాఘవరావు, రూరల్ ఎస్‌ఐ సైదాబాబు పట్టుకున్నారు. మిగతా నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. వారి నుంచి రూ.60లక్షల విలువైన 40 ఇత్తడి సైజర్‌లు, 35 అమరాన్ బ్యాటరీలు, యూపీఎస్ కేబుల్, 50 కేజీల కాపర్ వైరు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
షార్ట్ సర్క్యూట్‌తో ప్రింటింగ్ ప్రెస్ దగ్ధం


