బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలి
నల్లగొండ: ఆర్టీసీ బస్సు, ఆటో డ్రైవర్లకు పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణనష్టం జరగడానికి మానవ తప్పిదాలే కారణమన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం, సీట్‌బెల్ట్, హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆర్టీసీ బస్సు, ఆటో డ్రైవర్లు వాహనాలను బాధ్యతాయుతంగా నడపాలన్నారు. అనంతరం ఎరైవ్ ఎలైవ్ పేరుతో ప్రయాణికుల ప్రాణ భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, ప్రమాద రహిత ప్రయాణానికి సహకరిస్తామని డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ వాణి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ ఎస్‌ఐ సైదులు, ఆర్టీసీ డిప్యూటీ రిజినల్ మేనేజర్ రాంరెడ్డి, డీఏం వెంకటరమణ, అంజయ్య పాల్గొన్నారు.
సమయపాలన పాటించాలి
మర్రిగూడ: వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మర్రిగూడ మండల కేంద్రంలోని యూపీహెచ్‌సీ, సీహెచ్‌సీని సందర్శించి రికార్డులు పరిశీలించారు. అదేవిధంగా ఆరోగ్య మహిళా కేంద్రం, డయాలసిస్ యూనిట్, ఫార్మసీ, ల్యాబ్‌ను పరిశీలించి ఆరోగ్య కేంద్రాలను సమీక్షించారు. వార్డుల్లో రోగులకు అందుతున్న సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్‌ఓ వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాహుల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్‌నాయక్, షాలిని, దీపక్ తదితరులున్నారు.
కాలుష్యాన్ని
పరిశీలించిన ఈఈ
చిట్యాల: పట్టణంలోని రైస్ మిల్లుల నుంచి వస్తున్న కాలుష్యాన్ని అరికట్టాలని ఇటీవల పీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకన్న చిట్యాల పట్టణంలోని చంద్రపురి కాలనీ, ఆదర్శనగర్, ముత్యాలమ్మగూడెంలలో రైస్ మిల్లుల నుంచి వెదజల్లుతున్న కాలుష్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య కారక పరిశ్రమలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాదయ్య, సంజీవ, ఎల్లేష్, యాదగిరి, శ్రీనివాస్, యాదగిరిరెడ్డి పాల్గొన్నారు.
బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలి


