60ఏళ్లుగా పతంగుల తయారీలో ‘సాహు’ కుటుంబం
భువనగిరి: సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది గాలిపటాలు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వీటిని ఎగురవేస్తుంటారు. ఆరుదశాబ్దాలుగా ఈ పంతంగుల తయారీనే వృత్తిగా మలుచుకుంది భువనగిరికి చెందిన ఓ కుటుంబం. పట్టణంలోని సమ్మద్ చౌరస్తా సమీపంలో సాహు లక్ష్మీనారాయణ కుటుంబం 1963లో ఇంట్లోనే పతంగుల తయారీకి శ్రీకారం చుట్టింది. పతంగుల తయారీలో ఎన్నోమార్పులు వచ్చినా నేటికి సంప్రదాయ రీతిలో పేపర్, వెదురు కర్రలతో తయారు చేసి విక్రయిస్తున్నారు. గాలిపటాల తయారీకి అవసరమైన ముడిసరుకును హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు. ఏటా డిసెంబర్, జనవరి నెలల్లోనే పతంగుల సీజన్ వస్తుంది. దీనికోసం ఆగస్టు నుంచే పతంగులను తయారీకి శ్రీకారం చుడుతారు. నవంబర్‌కు వరకు తయారు చేసినవాటిని మార్కెట్లోకి తెస్తారు. ప్రతి సీజన్‌లో సుమారు 1,500 నుంచి రెండు వేల వరకు పతంగులను వివిధ డిజైన్లలో తయారు చేస్తారు. సీజన్‌లో పట్టణంలో నాలుగు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో డిజైన్, సైజులను బట్టి ఒక్కో పతంగికి రూ.10 నుంచి రూ.50 వరకు విక్రయిస్తుంటారు.
ఎన్నో రకాల కవర్ పతంగులు వచ్చినప్పటికీ పేపర్ పతంగులకు మంచి డిమాండ్ ఉంటుంది. సీజన్‌కు 5 నెలల ముందు తయారు చేయడం ప్రారంభిస్తాం. ఇంట్లో అందరికీ పతంగులు తయారు చేయడం వచ్చు. ప్రస్తుతం మనవరాళ్లు కూడా తయారు చేస్తున్నారు. స్వయంగా తయారు చేసి విక్రయించడం ద్వారా కూలి డబ్బులు లాభంగా ఉంటుంది.
– లక్ష్మీనారాయణ, పతంగుల తయారీదారుడు, భువనగిరి


