అర్ధరాత్రి స్వాతి వద్దకు వచ్చిన వ్యక్తి ఎవరు.. | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి స్వాతి వద్దకు వచ్చిన వ్యక్తి ఎవరు..

Dec 30 2023 1:28 AM | Updated on Dec 30 2023 7:29 AM

- - Sakshi

అలజడికి నిద్రలేచిన తల్లిదండ్రులు ఎవరని స్వాతిని ప్రశ్నించగా ఆయనొచ్చాడు అంటూ బదులిచ్చినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

నల్గొండ: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందింది. ఈ ఘటన త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాబుసాయిపేట గ్రామానికి చెందిన కొండమీది సైదయ్య, వెంకటమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, కుమారుడు సంతానం. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి నాలుగో కుమార్తె స్వాతికి నిడమనూరు మండలం ఇండ్లకొటయ్యగూడెం గ్రామానికి చెందిన వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురంలో కలతలు రావడంతో స్వాతి రెండేళ్ల క్రితం పుట్టింటికి వచ్చి కూలి పనులు చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తోంది.

ఉలుకూపలుకు లేకుండా..
గ్రామానికి చెందిన సైదయ్య, వెంకటమ్మలది నిరుపేద కుటుంబం. కూలి పనులకు వెళ్తేనే పూట గడుస్తుంది. ఇందులో భాగంగా తల్లిదండ్రులతో పాటు స్వాతి కూడా గురువారం కూలికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. భోజనం చేశాక తల్లిదండ్రులు పూరిపాకలో పడుకోగా స్వాతి పక్కనే ఉన్న మేకల కొట్టంలో మంచంపై నిద్రించింది. శుక్రవారం తెల్లవారిన తర్వాత సైదయ్య, వెంకటమ్మలు మేకల కొట్టం వద్దకు రాగా స్వాతి ఉలుకూపలుకు లేకుండా కనిపించింది. దీంతో వారు లబోదిబోమనడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే స్వాతి విగతజీవురాలైంది.

ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, హాలియా సీఐ గాంధీ, త్రిపురారం ఎస్‌ఐ వీరశేఖర్‌, ఏఎస్‌ఐ రామయ్య తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్వాతి మృతిపై తల్లిదండ్రులను అడిగి వివరాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మరణంపై అనుమానం ఉందని మృతురాలి తండ్రి సైదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరశేఖర్‌ తెలిపారు.

ఆయన ఎవరు..?
స్వాతి గురువారం రాత్రి 9గంటల సమయంలో మేకల కొట్టంలో నిద్రపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కొట్టంలో అలజడి అయినట్లు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలజడికి నిద్రలేచిన తల్లిదండ్రులు ఎవరని స్వాతిని ప్రశ్నించగా ఆయనొచ్చాడు అంటూ బదులిచ్చినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత స్వాతి వద్దకు వచ్చిన వ్యక్తి ఎవరనేది తేలితేనే కేసు చిక్కుముడి వీడుతుందని తెలుస్తోంది. కేసును పలు కోణాల్లో లోతుగా విచారణ జరుపుతున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఓ అంచనాకు రానున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement