వంతెనలు.. మృత్యుమార్గాలు
నిడమనూరు : మండల పరిధిలో నాగార్జున సాగర్ ఎడమకాల్వపై నిర్మించిన వంతెనలు (బ్రిడ్జిలు) మృత్యుమార్గాలుగా మారాయి. బ్రిడ్జిల వెంట రెయిలింగ్ లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ముకుందాపురం వద్ద ఓ కారు కాల్వలో పడిన ఘటనలో దంపతుల ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తు కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. రోడ్డు నేరుగా కాల్వలోకి ఉండటం, బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు వెంట బారికేడ్లు, కాల్వలోకి వెళ్లకుండా రాతి స్తంభాలు లేకపోవడంతో కాల్వలోకి కారు దూసుకెళ్లిందని ఘటన స్థలాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు నిర్ధారించారు.
నాలుగు చోట్ల బ్రిడ్జిలు ఉన్నా..
సాగర్ ఎడమకాల్వపై నిడమనూరు మండలంలోని 28 కిలోమీటర్ వద్ద ముప్పారం, 32.5 కిలోమీటర్ వద్ద వేంపాడు, బొకమంతలపహాడ్, ముకుందాపురం గ్రామాల వద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జిలపై కొంతమేర మాత్రమే ఇనుప రెయిలింగ్ ఉండగా అప్రోచ్ రోడ్డు కాల్వ వెంట కొంతదూరం రెయిలింగ్ లేకపోవడంతో రోడ్డంతా కాల్వలోకి వెళ్లేలా ఉంటుంది. దీంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. రాత్రి వేళల్లో కానీ, వేంపాడు, ముప్పారం గ్రామాలకు వెళ్లాలంటే మూలమలుపు వెంటనే కాల్వ కనిపిస్తోంది. 3 మీటర్ల పరిధిలో చిన్నగా బ్రిడ్జి కనిపిస్తోంది. బ్రిడ్జికి అప్రోచ్‌గా కొంత ఇనుప కంచె కానీ, గోడ నిర్మించాల్సి ఉంది. అయితే సాగర్ ఆధునీకరణ పనులు చేపడుతున్నప్పుడు బ్రిడ్జిల వెంట ఉన్న రాతి స్తంభాలు, బారికేడ్లను పూర్తిగా తొలగించారు. పనులు పూర్తయిన అనంతరం రక్షణ గోడలుకానీ బారికేడ్లు నిర్మించలేదు. అసంపూర్తి పనులు కూడా చేపట్టలేదు. ఫలితంగా ప్రమాదాలు జరుగతున్నాయి. ఇప్పటికై నా ఎన్‌ఎస్‌పీ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న వంతెనల వద్ద ఇనుప కంచె కానీ రక్షణ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
ముప్పారం, వేంపాడు, ముకుందాపుర, బొకమంతలపహాడ్ వద్ద సాగర్ ఎడమకాల్వపై ఉన్న బ్రిడ్జిల వెంట రక్షణ గోడలు నిర్మించాలి. ముప్పా రం బ్రిడ్జి మీదుగా, ఊట్కూరు, సోమవారిగూడెం, ముప్పారం, నందికొండవారిగూడెం గ్రామాలకు రాకపోకలు సాగిస్తారు. ప్రమాదాల నేపథ్యంలో రాత్రి వేళల్లో ప్రయాణించాలంటే ఇబ్బందిగా ఉంది. రక్షణ గోడలు నిర్మించాలి.
– కేశబోయిన జానయ్య, సహకార సంఘం మాజీ డైరెక్టర్ ఊట్కూరు
వేంపాడు, గుంటిపల్లి, ఎర్రబెల్లికి వెళ్లాలంటే వేంపాడు వద్ద బ్రిడ్జి ప్రమాదకరంగా ఉంది. రాత్రి వేళలో పలు గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జి వద్దకు రాగానే భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు వేంపాడు కాల్వ వెంట రోడ్డు మూలమలుపు ఉండటంతో దూరంగా ఉన్నప్పుడే కాల్వను, బ్రిడ్జిని గుర్తించలేని పరిస్థితి నెలకొంది. బ్రిడ్జికి ఇరువైపులా రెయిలింగ్‌తోపాటు సూచికలు ఏర్పాటుచేయాలి.
– మల్లికంటి కోటయ్య, రైతు, వేంపాడు
ఫ ప్రమాదకరంగా సాగర్ ఎడమకాల్వపై బ్రిడ్జిలు
ఫ కాల్వ ఆధునీకరణ పనుల్లో దెబ్బతిన్న రక్షణ గోడలు
ఫ తాజాగా ముకుందాపురం వద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు
ఫ ఈ ఘటనలో దంపతుల మృత్యువాత
ఫ బ్రిడ్జిలపై రెయిలింగ్ ఏర్పాటు చేయాలంటున్న స్థానికులు


