ఓటరు తీర్పు ఎటువైపు! | - | Sakshi
Sakshi News home page

ఓటరు తీర్పు ఎటువైపు!

Feb 13 2026 7:04 AM | Updated on Feb 13 2026 7:04 AM

ఓటరు తీర్పు ఎటువైపు!

ఓటరు తీర్పు ఎటువైపు!

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయంపై ఆయా రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. అభ్యర్థులు కూడా ఎవరికి వారు తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్‌లో డివిజన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా జరిగిన పోలింగ్‌ వివరాలను ముందేసుకుని ఎన్ని ఓట్లు తేడాతో బయటపడతామనే అంచనాలు వేసుకుంటున్నారు. ఆయా పోలింగ్‌ స్టేషన్లలో ఓటర్ల క్రమ సంఖ్యల వారీగా ఎందరు ఓటేశారు..? ఎందరు గైర్హాజరయ్యారు ? ఓట్లేసిన వారిలో తమ వారెవరు..? ఎదుటి పక్షానికి చెందిన వారెవరు అంటూ లెక్కలతో కుస్తీలు పడుతున్నారు.

ఎవరి ధీమా వారిదే..

జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌, చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, నందికొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 78.09 శాతం ఓట్లు పోలయ్యాయి. ఏ వార్డు తీసుకున్నా 75 శాతానికి పైగానే ఓటింగ్‌ నమోదైంది. ఫలితాలపై అభ్యర్థులు ఎవరికి వారే ధీమాగా ఉన్నారు.

అధికంగా ద్విముఖ పోరే..

కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు, వార్డుల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యే ద్విముఖ పోటీ నెలకొంది. మరికొన్ని వార్డుల్లో బీజేపీ సైతం ఉండడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. మొత్తంగా పరిశీలిస్తే.. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాత్రమే ఢీ అంటే ఢీ అనే విధంగా పోటీపడ్డాయని పార్టీల నేతలు చెబుతున్నారు. మొత్తంగా 162 వార్డులకు గాను హాలియాలో ఒక వార్డు ఏకగ్రీవంగా కావడంతో 161 వార్డులకు పోలింగ్‌ జరిగింది. నల్లగొండ కార్పొరేషన్‌, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో 48 చొప్పున డివిజన్లు, వార్డులు ఉండగా, దేవరకొండలో 20 వార్డులు, చండూరులో 10 వార్డులు కాగా, చిట్యాల, హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో 12 చొప్పున వార్డులు ఉన్నాయి.

గెలుపు అంచనాలో కాంగ్రెస్‌

అన్ని స్థానాలపై కాంగ్రెస్‌ పార్టీ ఽపూర్తి ధీమాగా ఉంది. బీఆర్‌ఎస్‌ పార్టీ.. అన్నిచోట్ల గట్టిపోటీ ఇచ్చామని, తమకూ సమాన అవకాశాలు ఉన్నాయని పేర్కొంటోంది. బీజేపీ కూడా ఈసారి తమకు గతంలో కంటే అధిక స్థానాల్లో గెలుపొందుతామన్న ధీమాలో ఉండగా ఎంఐఎం, పార్వర్డు బ్లాక్‌ అభ్యర్థులు, స్వతంత్రులు కూడా కొందరు గెలుపు మాదే అంటున్నారు. ఒక వార్డులో 2,500 ఓట్లు ఉన్నాయని అనుకుంటే.. అందులో కనీసం 2,200 ఓట్లు పోలైతే.. త్రిముఖ పోటీ ఉన్నచోట అభ్యర్థి విజయానికి కనీసం 750 ఓట్లు వస్తే చాలు. ద్విముఖ పోటీ ఉన్నచోట అయితే 1,100 ఓట్లకు ఒక్కటి ఎక్కువ వచ్చినా గెలుస్తామని భావిస్తున్నారు. వార్డులో పోలైన ఓట్లు, ఏ పార్టీకి ఎన్ని పోల్‌ అయ్యి ఉంటాయి, తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందో అంచనాలు కట్టేందుకు కుస్తీ పడుతున్నారు.

మేయర్‌ పీఠం కాంగ్రెస్‌కే..?

కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీల్లోని వార్డుల సంఖ్యలో యాభై శాతం ప్లస్‌ ఒక సీటు అదనంగా వచ్చిన పార్టీ మేయర్‌/చైర్మన్‌ పీఠాలు కై వసం చేసుకునే వీలుంది. ఒకవేళ యాభై శాతం సీట్ల మేరకు ఒకటి రెండు తక్కువ సీట్లు వచ్చినా.. అధికార పార్టీకి ఎక్స్‌ అఫీషియో సభ్యుల ఓట్లు అందుబాటులో ఉండడం అదనపు బలం కానుంది. ఈ సమీకరణతోనే అన్నిచోట్లా తామే మేయర్‌/చైర్మన్‌ పీఠాలు దక్కించుకుంటామని కాంగ్రెస్‌ నాయకత్వం చెబుతోంది. నల్లగొండ కార్పొరేషన్‌లో 48 డివిజన్లకు 25 సీట్లు వచ్చిన పార్టీకే మేయర్‌ పీఠం దక్కనుంది. అయితే ఇప్పటికే ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం కాంగ్రెస్‌ 30కి పైగా డివిజన్లను గెలుచుకునే అవకాశం ఉంది. ఎక్స్‌ అఫీషియో సభ్యుల అవసరం లేకుండా మేయర్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకుంటుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్‌

నల్లగొండ : నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఆరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుపారదర్శకంగా ఉండాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్‌ అన్నారు. గురువారం ఆయన నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాముతోపాటు సాగర్‌ రోడ్డులోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. నల్లగొండలోని ఆర్జాలబావి వద్ద గోదాం, మిర్యాలగూడ పరిధిలోని అవంతీపురం మార్కెట్‌ యార్డులో, నల్లగొండలోని సాగర్‌ రోడ్డులో ఉన్న నిడమనూరు బాలికల గురుకులంలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపునకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, అదనపు కలెక్టర్‌ వై.అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

మున్సిపోల్స్‌లో గెలిచేదెవరో.. ఓడేదెవరో..

ఫ ఫలితాల అంచనాల్లో అభ్యర్థులు

ఫ కార్పొరేషన్‌ మేయర్‌ పీఠం

తమదేనంటున్న కాంగ్రెస్‌

ఫ మున్సిపాలిటీల్లోనూ

అనుకూలమేనంటూ ప్రకటనలు

ఫ గెలుపుపై ధీమాతో ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతున్న అభ్యర్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement