నేడే పుర కౌంటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడే పుర కౌంటింగ్‌

Feb 13 2026 7:04 AM | Updated on Feb 13 2026 7:04 AM

నేడే పుర కౌంటింగ్‌

నేడే పుర కౌంటింగ్‌

వార్డుకో టేబుల్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ శుక్రవారం (ఈ నెల 13వ తేదీన) జరగునుంది. జిల్లాలో నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించి మూడు చోట్ల ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ అనంతరం మధ్యాహ్నం వరకు అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

మూడు కేంద్రాల్లో కౌంటింగ్‌

నల్లగొండ కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు నల్లగొండలోని ఆర్జాలబావి వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదా ములో జరగనుంది. అలాగే మిర్యాలగూడ, హాలియా, నందికొండ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు మిర్యాలగూడలోని అవంతీపురం మార్కెట్‌ యార్డులో జరుగనుంది. ఇక, దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు నల్లగొండ సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ వద్ద ఉన్న నిడమనూరు గురుకుల పాఠశాల భవనంలో నిర్వహిస్తున్నారు.

ఉదయం 8 గంటలకే..

శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరిచి ఆయా వార్డులకు సంబంధించిన పోలింగ్‌ స్టేషన్ల వారీగా బ్యాలెటు బాక్సులను తెచ్చి టేబుళ్ల్లపై ఉంచుతారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఆయా వార్డుల్లోని బ్యాలెట్‌ పేపర్లను పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఇనిషియల్‌ కౌంటింగ్‌ చేస్తారు. పోలింగ్‌ జరిగిన రోజు బ్యాలెట్‌ పేపర్ల లెక్క, బ్యాలెట్‌ బాక్సులు తెరిచిన తరువాత అన్ని బ్యాలెట్‌ పేపర్లు ఉన్నాయా లేదా? అన్నది సరిచూస్తారు. ఆ తర్వాత 25 బ్యాలెట్‌ పేపర్లను ఒక బండిల్‌గా కట్టి ఒక డ్రమ్ములో వేస్తారు.

ఐదు మున్సిపాలిటీల ఫలితాలు 2గంటల

వ్యవధిలోనే..

దేవరకొండ, చండూరు, చిట్యాల, నందికొండ, హాలియా మున్సిపాలిటీల్లో వార్డులు కేవలం 20లోపే ఉన్నాయి. ఇవన్నీ దాదాపు 2 రౌండ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం అయితే 2 గంటల వ్యవధిలోనే అంటే ఉదయం 10గంటల లోపే వీటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

ఉదయం 11.30 వరకు నల్లగొండ,

మిర్యాలగూడ తుది ఫలితాలు

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమైతే మొదట పోస్టల్‌ బ్యాలెట్‌, ఇనిషియల్‌ ఓట్ల కౌంటింగ్‌తోపాటు బండిల్స్‌ కట్టే ప్రక్రియ 9 గంటల వరకు పూర్తికానుంది. ఆ తర్వాత ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. దాదాపు 3 వేలలోపే ఒక్కో వార్డులో ఓటర్లున్నారు. కొన్ని డివిజన్లు, వార్డుల్లో మాత్రమే 3 వేల పైచిలుకు ఓటర్లున్నారు. అత్యధికంగా ఉన్న వార్డులున్న నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో ఉదయం 11.30 గంటల వరకు ఓట్ల లెక్కింపు పూర్తయి తుది ఫలితాలు వెలువడనున్నాయి.

మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్‌ టేబుళ్లు

నల్లగొండ కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపునకు 56 టేబుళ్లు ఏర్పాటు చేయగా, మిర్యాలగూడ మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపుకు 49, దేవరకొండకు 20, చండూరుకు 10, చిట్యాలకు 12, నందికొండకు 12, హాలియా 11 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్లను ఒక్కో రౌండ్‌లోనే లెక్కించనున్నారు.

తేలనున్న మున్సిపల్‌ అభ్యర్థుల భవితవ్యం

ఫ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఫ కౌంటింగ్‌కు మూడు కేంద్రాలు

ఫ ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్ల చొప్పున

ఫ మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు

ఫ ఉదయం 11.30 గంటల వరకు తుది ఫలితాలు

జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో ఉన్న వార్డుల్లో ఓట్ల లెక్కింపునకు వార్డుకో టేబుల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వార్డుల్లో 2,500కుపైగా ఓట్లు ఉంటే 2 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో టేబుల్‌పై ఓట్ల లెక్కింపునకు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లను కౌంటింగ్‌ కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 55 మంది రిటర్నింగ్‌ అధికారులతోపాటు ఒక్కో రిటర్నింగ్‌ అధికారికి ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement