ఆ నలభై నిమిషాల్లో ఏం జరిగింది..? | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్‌కు శోభ ఎందుకు వెళ్లింది?

Published Mon, May 29 2023 7:18 AM

- - Sakshi

మిర్యాలగూడ అర్బన్‌ : మిర్యాలగూడ పట్టణంలో శనివారం రాత్రి వెలుగులోకి వచ్చిన యువతి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడలేదు. పట్టణంలోని సుందర్‌నర్‌కు చెందిన దండగల వెంకన్న అలివేలు దంపతుల కుమార్తె దండగల శోభ(18) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో రిసెప్సనిస్టుగా పనిచేసిన శోభ పరీక్షలు ఉండటంతో ఇంటి వద్దనే ఉండి చదువుకుంటోంది.

ఈ క్రమంలో ఏమైందో ఏమో గాని శనివారం రాత్రి 7:40 గంటల సమయంలో బైపాస్‌రోడ్డు వెంట ఉన్న వైష్ణవి అపార్ట్‌మెంట్‌ వద్దకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యం బైపాస్‌రోడ్డు వెంట ఉన్న ఖలీల్‌ దాబా ఎదురుగా ఉన్న సీసీ కెమరాల్లో రికార్డు కాగా ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైష్ణవి అపార్ట్‌మెంట్‌లోని రెండవ అంతస్తు వరకు శోభ చేరుకున్నట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

కూపీ లాగుతున్న పోలీసులు
కాగా, వైష్ణవి అపార్ట్‌మెంట్‌లోకి శనివారం రాత్రి 7.40 గంటలకు చేరుకున్న శోభ మరో 40నిమిషాల అనంతరం రెండో అంతస్తు నుంచి కిందపడింది. అయితే, అపార్ట్‌మెంట్‌కు శోభ ఎందుకు వెళ్లింది? ఎవరితో మాట్లాడింది.? 40నిమిషాల్లో ఏం జరిగింది. అనే అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా, శోభ తన సెల్‌ఫోన్‌ ఇంట్లోనే వదిలి వెళ్లింది. ఘటన తర్వాత పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఐదు నెలల కాల్‌డేటా సేకరించే పనిలో ఉన్నారు.

కాగా, కూతురు మృతిపై అనుమానాలున్నాయని శోభ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్‌లో తమకు తెలిసిన వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. కాగా, ఆది వారం మధ్యాహ్నం శోభ మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించగా అంత్యక్రియలు పూర్తిచేశారు. శోభ మృతి విషయం తెలుసుకున్న వారి బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్‌ ఎస్‌ఐ శ్రీనునాయక్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement