కందనూలు: రైతులకు యూరియా, ఎరువులు పారదర్శకంగా అందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని గ్రోమోర్ పురుగు మందుల విక్రయ కేంద్రం, పీఏసీఎస్, ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్‌తో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా నిల్వలు, ఆన్‌లైన్ పంపిణీ విధానాన్ని, అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న స్టాక్ పరిమాణం, రైతుల అవసరాలు, రాబోయే రోజుల్లో ఉండే డిమాండ్‌కు అనుగుణంగా నిల్వల నిర్వహణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే దుకాణంలో నిర్వహిస్తున్న స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, మున్సిపల్ అనుమతులు, నానో యూరియా, నానో డీఏపీ వంటి ఉత్పత్తుల లభ్యతపై వివరాలు సేకరించారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతులకు నిరంతరాయంగా ఎరువులు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం పీఏసీఎస్ సందర్శించిన కలెక్టర్ అక్కడ రైతులకు ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్న యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. రైతుల ఆధార్ ధ్రువీకరణ, బయోమెట్రిక్ నమోదు, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) యంత్రాల ద్వారా జరుగుతున్న విక్రయాల విధానాన్ని పరిశీలించి, ప్రతి రైతుకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంపిణీ కేంద్రంలో నిర్వహిస్తున్న స్టాక్ రిజిస్టర్లు, విక్రయాల నమోదు, రోజువారీ లావాదేవీల వివరాలను కూడా తనిఖీ చేసి.. ఎరువుల సరఫరా విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో అవసరమైన మేరకు యూరియా నిల్వలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికారి రఘునాథ్‌రావు, ఆర్డీఓ సురేష్‌బాబు, వ్యవసాయ అధికారి పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు.
అంగన్‌వాడీలపై నిరంతర పర్యవేక్షణ
అంగన్‌వాడీలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. వీసీ హాల్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడంతోపాటు పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల ఆరోగ్య స్థితిపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. జాతీయ బాల ఆరోగ్య రక్ష బృందాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు, పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని నల్లమల ఏజెన్సీ ప్రాంత అంగన్‌వాడీ కేంద్రాలపై మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు.


