ధరూరు/ రాజోళి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. కొన్ని రోజులుగా స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం వరకు 2,596 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు వదలగా.. మరో 43 43 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.773 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సుంకేసుల డ్యాంలో శుక్రవారం ఒక గేటు తెరిచి దిగువకు నీటిని వదిలిన అధికారులు శనివారం గేటును మూసేశారు. డ్యాంకు శనివారం ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోవడంతో గేటును మూసినట్లు అధికారులు తెలిపారు.


