‘సర్‌’ పై అప్రమత్తంగాఉండండి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ పై అప్రమత్తంగాఉండండి

Jun 13 2026 1:41 PM | Updated on Jun 13 2026 1:41 PM

కొల్లాపూర్‌: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘సర్‌’ పట్ల కాంగ్రెస్‌ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుందని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సర్‌పై అవగాహన కోసం డీసీసీ ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతో కలిసి మంత్రి జూపల్లి పాల్గొని మాట్లాడారు. సర్‌ అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. మతం పేరుతో ఓట్లు తొలగించేందుకు ఇదో రకమైన కుట్ర అన్నారు. బూత్‌ స్థాయిలో ఉండేవారు ఓటరు జాబితాను జాగ్రత్తగా గమనించాలని, ఇతర ప్రాంతాల్లో ఓటర్లు ఉంటే వారితో ఫోన్లో మాట్లాడి వివరాలు రిజిస్ట్రేషన్‌ చేసేలా చూడాలన్నారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు వీటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు మేలు చేసేలా ఎన్నికల కమిషన్‌ చర్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్‌ వ్యవహారంతోపాటు పలు అంశాల్లో ఇదే జరుగుతోందన్నారు. విపక్షాల ఓటుబ్యాంకును తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, కాంగ్రెస్‌ శ్రేణులు దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ బూత్‌స్థాయిలో ఓటరు జాబితా వివరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల ఓటుబ్యాంకును తగ్గించే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.

బస్సు యాత్ర ప్రారంభం..

కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి వివరించేందుకు చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం కొల్లాపూర్‌లో ప్రారంభమైంది. యాత్రను డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లురవి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, గతంలో చేసిన పనుల గురించి ప్రజలకు వివరించాలని మంత్రి సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి జ్యోతి, వైస్‌చైర్మన్‌ రహీంపాష, నాయకులు హన్మంతునాయక్‌, నర్సింహ, ఎక్బాల్‌, ధర్మతేజ, సూర్యప్రతాప్‌గౌడ్‌, దండు నర్సింహ, రామన్‌గౌడ్‌, నర్సింహయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ శ్రేణులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచన

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement