కందనూలు: క్రీడలతోనే మానసికోల్లాసం ఉంటుందని డీవైఎఫ్‌ఓ సీతారాం అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ మండలంలోని తూడుకుర్తి పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 45 రోజులుగా కొనసాగుతున్న ఖోఖో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్‌ఫోన్లకు బానిస కాకుండా క్రీడా పోటీలకు హాజరై క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవడం శుభాపరిణామమన్నారు. వేసవి శిబిరాల ద్వారా విద్యార్థులు తన క్రీడాంశాలను పెంపొందించుకొని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణించి పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ నీతివంతమైన సమాజాన్ని నిర్మించడానికి క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు అంజయ్య, కృష్ణమోహన్, ప్రసాద్, వెంకట్, శిబిరం కోచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫస్టియర్‌లో 58.0,
సెకండియర్‌లో 43.0
● ఇంటర్ సప్లిమెంటరీఫలితాలు విడుదల
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. గురువారం వెలువడిన అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 58.0 శాతం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 43.0 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 1,684 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 734 మంది పాసయ్యారు. ఇందులో బాలురు 938 మందికి గాను 374 మంది, బాలికలు 746 మందికి గాను 360 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ప్రథమ సంవత్సరంలో 3,337 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 1,960 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 1,390 మందికి గాను 610 మంది, బాలికలు 1,947 మందికి గాను 1,350 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌లో 459 మందికి గాను 287 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 643 మందికి గాను 449 మంది ఉత్తీర్ణత సాధించారని డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
జూరాలకు 2,388 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లోలు కొనసాగుతుంది. స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 2,388 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చిందని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు నీటి పంపింగ్‌ను చేస్తున్నారు. రెండు పంపులను రన్ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, క్యూసెక్కులు ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు మొత్తం 1,543 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.572 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు.


