గాలిమోటార్‌లో తిరుగుతూ గాలి మాటలు | - | Sakshi
Sakshi News home page

గాలిమోటార్‌లో తిరుగుతూ గాలి మాటలు

Jun 6 2026 1:41 AM | Updated on Jun 6 2026 1:41 AM

పాలమూరు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాలి మోటార్‌లో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్నారని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కాంగ్రెస్‌ వైఫల్యాలపై పోరాటాలు, నిరసన దీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్‌ వాళ్లకు అవగాహన, చిత్తశుద్ధి లేవన్నారు. నగరంలోని రెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ శిక్షణ తరగతులను ఎంపీ ప్రారంభించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్‌ కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానని చెప్పినా పూర్తి చేయలేదని, ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో నిధులు ఇచ్చింది లేదని విమర్శించారు. జిల్లా నుంచి గెలుపొందిన సీఎం రేవంత్‌రెడ్డి పెండింగ్‌ ప్రాజెక్టులపై చేసింది ఏం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఇస్తున్నారు తప్పా అర్హులకు అందడం లేదన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం ఎగ్గొట్టారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసంతో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, అదేవిధంగా తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి మండలస్థాయి వరకు స్థానిక సమస్యలపై పోరాటాలు, దీక్షలు, నిరసన కార్యక్రమాలను ప్రజాస్వామ్య పద్ధతిలో భారీగా నిర్వహించాలన్నారు. తెలంగాణ మొత్తాన్ని కాషాయమయం చేస్తామనే సంకల్పబలంతో ముందుకు వెళ్లాలన్నారు. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ దొచుకుందని, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఉందని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 14 మంది బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించుకునే రోజు తొందరలో వస్తుందన్నారు. రాష్ట్ర వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నేతలు పద్మజారెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, బాలరాజు, రాములు, రమేష్‌ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

బాదేపల్లిలో ధాన్యం ధర క్వింటాకు రూ. 3,012

జడ్చర్ల: బాదేపల్లి మార్కెట్‌ యార్డులో శుక్రవా రం ధాన్యానికి రికార్డు ధర దక్కింది. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్‌ క్వింటాకు గరిష్టంగా రూ.3,012, కనిష్టంగా రూ.1,620 ధర లభించింది. ఈ సీజన్‌లో ఇంత ధర లభించడం ఇదే మొదటిసారిగా మార్కెట్‌ అధికారులు తెలిపారు. వరికి ఏ గ్రేడ్‌ మద్దతు ధర క్వింటాకు రూ.2,461 ఉంది. అయితే ఇక్కడ మద్దతు ధరను మించి ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మొక్కజొన్నకు గరిష్టంగా రూ.1,999, కనిష్టంగా రూ.1,611, వేరుశనగకు గరిష్టంగా రూ.4,699, కనిష్టంగా రూ.4,489, పొద్దుతిరుగుడుకు గరిష్టంగా రూ.6,826, కనిష్టంగా రూ.6,756 ధరలు పలికాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 90 శాతం ఎగ్గొట్టారు

ఎంపీ డీకే అరుణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement