● మృతులిద్దరు ఒకే గ్రామానికి చెందిన సమీప బంధువులు
కల్వకుర్తి రూరల్: బంధువును కారులో తన ఇంటి వద్ద వదిలి తిరిగి వస్తుండగా.. జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని తాండ్ర సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వంగూరు మండల కేంద్రానికి చెందిన బండపల్లి బాలరాజు(26), బండపల్లి ప్రవీణ్(25), బండపల్లి రాజు బంధువులు. ముగ్గురు కలసి కారులో తమ బంధువును మండలంలోని తర్నికల్‌లో సోమవారం రాత్రి వదిలి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా, తాండ్ర, కొండారెడ్డిపల్లి సమీపంలో వస్తుండగా.. కారును గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టడంతో రోడ్డు పక్కన గుంతలో పడింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో బాలరాజు, ప్రవీణ్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. డ్రైవర్ రాజు తీవ్రంగా గాయపడ్డాడు. రాజును మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించినట్లు ఎస్‌ఐ కురుమూర్తి వివరించారు. మృతులిద్దరు సమీప బంధువులు కాగా.. బండపల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
వంగూరులో విషాదం
వంగూరు: ఎంతో భవిష్యత్ ఉన్న ఇద్దరు యువకులు ఒకే ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము న కల్వకుర్తి మండలం తాండ్ర శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వంగూరుకు యువకులు దుర్మరణం చెందగా.. మృతులిద్దరికి తండ్రులు లేకపోవడం చేతికొచ్చిన కొడుకులు అకాల మరణం పొందడంతో తల్లుల రోధనలు మిన్నంటాయి.


