సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

కందనూలు/ కొల్లాపూర్‌ రూరల్‌: జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేయాలన్నారు. ఈ నెల 4, 5న పర్యటనలో భాగంగా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలను సందర్శించడంతోపాటు జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు తీరును స్వయంగా పరిశీలించే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండకూడదని, హెలీప్యాడ్లు, కార్యక్రమ ప్రాంగణాలు, వీవీఐపీ మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ ఏర్పాట్లు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు బస చేయనున్న సోమశిల హరిత గెస్ట్‌హౌస్‌లో భద్రత, వసతి, ఆహారం, తాగునీరు, విద్యుత్‌ సరఫరా, వైద్య సేవలు తదితర అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవసహాయం, డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్ల పరిశీలన..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనకు సంబంధించి సోమశిల, నార్లాపూర్‌ ప్రాంతాల్లో కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ ముందస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటి సోమశిలలో హరిత గెస్ట్‌హౌస్‌ను సందర్శించిన వారు సీఎం బస చేయనున్న గదులు, సమావేశ మందిరాలు, విశ్రాంతి సదుపాయాలు, తాగునీరు, విద్యుత్‌, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. హెలీప్యాడ్‌ నుంచి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే రహదారుల మరమ్మతు, శుభ్రత పనులను వెంటనే పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. అనంతరం పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీ–3 పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ పార్ధసారథి, ఆర్డీఓలు భన్సీలాల్‌, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement