సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో సుమారు 12 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి.. సాగు నీరందించాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్ ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ఆ పార్టీ ముఖ్య నేతలైన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు కసరత్తు మొదలుపెట్టారు. తొలి దశలో పాలమూరు ప్రాజెక్ట్‌తో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు సాగించేలా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఒకవైపు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సంస్థాగత బలోపేతంలో భాగంగా సభ్యత్వ నమోదు చేపట్టడంతో పాటు మరోవైపు ప్రజా సమస్యలపై గళం వినిపించేలా సమాయత్తమవుతుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
జూన్ మొదటి వారంలో...
చివరి దశలో మిగిలిన ప్రతిష్టాత్మక పాలమూరు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే సంకల్పంతో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పాలమూరులోని 14 నియోజకవర్గాలకు చెందిన ఆ పార్టీ ముఖ్య నాయకులు హైదరాబాద్‌లో ఇటీవల పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత పాలమూరు ప్రాజెక్ట్ కోసం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో ఆయనతో పాటు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, నవీన్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర నేతలు మరోమారు సమావేశమై చర్చించిన అనంతరం వచ్చే నెలలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. వారి మాటలను బట్టి జూన్ మొదటి వారంలోపు లేదంటే రెండో వారం ప్రారంభంలో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.
విద్య, వైద్యం తదితర రంగాల వారీగా
సైతం..
పాదయాత్ర అనంతరం జిల్లాకేంద్రాలు, తదితర ముఖ్య ప్రాంతాల వారీగా వ్యవసాయం, విద్య, వైద్యం వంటి వివిధ రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్‌ఎస్ నేతలు రోజు వారీగా పోరు కొనసాగించనున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల వారీగా సైతం భేటీలు నిర్వహించి.. వారి సమస్యల పరిష్కారం దిశగా గళమెత్తేలా నేతలు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్ హయాంలో అమలైన పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజలకు చేకూరిన మేలు వివరిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల తీరుపై ఎండగట్టే కార్యాచరణతో గులాబీ దళం ప్రత్యేక కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది.
తొలి రోజు కేటీఆర్..
చివరి రోజు కేసీఆర్
పాదయాత్ర షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారు. యాత్ర ప్రారంభమయ్యే తొలి రోజు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు సమాచారం. పాదయాత్ర మధ్య మధ్యలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. రోజు వారీగా కిలోమీటర్ల వారీగా కొనసాగనున్న యాత్రకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో రైతులతో మాటామంతి, కార్నర్ మీటింగ్‌లు, బస చేసే ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించేలా నేతలు ప్రణాళిక తయారు చేస్తున్నారు. చివరి రోజు ప్రజలతో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సభకు బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానుండగా.. పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేలా ఉమ్మడి జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నాయకులతో ముఖ్య నేతలు ముందస్తుగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
బీఆర్‌ఎస్ నేతల ఉద్యమ కార్యాచరణ
జూన్‌లో పాదయాత్రకు సన్నాహాలు
నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు..
తొలి రోజు కేటీఆర్, మధ్యలో హరీశ్‌రావు హాజరు
చివరి రోజు భారీ బహిరంగ సభ
‘గులాబీ’ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాక
నార్లాపూర్ లేదంటే ఉదండాపూర్ నుంచి..
పాలమూరు ప్రాజెక్ట్‌కు సంబంధించి తొలి దశలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్, వనపర్తి జిల్లాలో ఏదుల, నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వట్టెం, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కర్వెన, జడ్చర్ల మండలంలో ఉదండాపూర్ రిజర్వయర్లను నిర్మిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్‌లో మొదటి పంప్ మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే బీఆర్‌ఎస్ నేతలు పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ లెక్కన ఉదండాపూర్‌లో యాత్ర ముగియనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉదండాపూర్‌లోనే పాదయాత్ర ప్రారంభించి.. నార్లాపూర్‌లో ముగించే అవకాశం సైతం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.


