ఉచ్చులతో ఉసురు.. | - | Sakshi
Sakshi News home page

ఉచ్చులతో ఉసురు..

May 16 2026 1:33 AM | Updated on May 16 2026 1:33 AM

వేటగాళ్ల ఉచ్చులో చిక్కి బలవుతున్న వన్యప్రాణులు

–8లో u

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాకు మణిహారంగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతం అనేక రకాల వన్యప్రాణులకు ఆశ్రయం కల్పిస్తోంది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో 34 వరకు పెద్ద పులులు, వందకు పైగా చిరుతలు, వేల సంఖ్యలో జింకలు, దుప్పులు, సాంబార్‌డీర్‌, ఇతర వన్యప్రాణులు జీవిస్తున్నాయి. కానీ వేటగాళ్ల రూపంలో వన్యప్రాణులకు, అరుదైన జంతుజాలానికి పెనుముప్పు పొంచి ఉంది. వన్యప్రాణుల మాంసం, విక్రయాల కోసం తరచుగా నల్లమలలో వేట కొనసాగుతూనే ఉంది. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేస్తున్నా వేటగాళ్లలో మార్పు రావడం లేదు. జిల్లాలో వన్యప్రాణుల వేటకు అడ్డుకట్ట పడటం లేదు.

మాటు వేసి.. గుట్టుగా తరలింపు..

నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న పరిసర గ్రామాలు, శివారు ప్రాంతాల్లో తరచుగా వన్యప్రాణులను వేటాడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వేటగాళ్లు రోజుల తరబడి ప్రణాళికతో ఉచ్చు బిగించి వన్యప్రాణులను బలి తీసుకుంటున్నారు. తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లి శివారు ప్రాంతంలో సాంబార్‌డీర్‌ (కణతి)ను వేటాడి కళేబరాన్ని కారులో తరలిస్తున్న మొలచింతలపల్లికి చెందిన బేరి శ్రీనివాసులు, పెబ్బేటి శివ, వట్టిపల్లికి చెందిన అనమోని బాబు, శివ అదుపులోకి తీసుకున్నారు. కణితి మాంసం, కారును స్వాధీనం చేసుకుని వారిని అచ్చంపేట ఎఫ్‌డీఓ కార్యాలయానికి తరలించారు.

బలి తీసుకుంటున్న కరెంట్‌..

నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ పెనవేసుకుని ఉన్న గ్రామాలు, శివారు ప్రాంతాల్లో వ్యవసాయ, పోడు, కంచె భూముల్లో వన్యప్రాణులకు కరెంట్‌ పెడుతుండటం కలవరపెడుతోంది. కొందరు రైతులు తమ పంటలను అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు కరెంట్‌ వైర్లను ఏర్పాటు చేసుకోగా.. మరికొందరు వేట కోసమే కరెంట్‌ వైర్లు బిగిస్తున్నారు. అడవి పందులు, సాంబార్‌డీర్‌, జింకలే లక్ష్యంగా కరెంట్‌ వైర్లు, ఉచ్చులను పెడుతున్నారు. ఈ క్రమంలో అదే దారిన వెళ్తున్న రైతులు, ఇతర వ్యక్తులు సైతం విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. లింగాల మండలం పాతరాయవరంలో రెండేళ్ల కిందట కరెంట్‌ వైర్‌కు తగిలి రైతు బలయ్యాడు.

కఠిన చర్యలు తీసుకుంటాం

వన్యప్రాణులను వేటాడితే చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇటీవల కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లి సమీపంలో సాంబార్‌ డీర్‌ను వేటాడిన నిందితులను పట్టుకున్నాం. ఇందుకు సంబంధించిన నలుగురిని అరెస్ట్‌చేసి జైలుకు పంపించాం. వన్యప్రాణుల సంరక్షణకు మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటాం. నల్లమల పరిసరాల్లో నిఘా పెంచుతాం.

– చంద్రశేఖర్‌, ఎఫ్‌డీఓ, అచ్చంపేట

నల్లమల పరిసరాల్లో కొనసాగుతున్న వేట

అమ్రాబాద్‌, పదర, లింగాల, కొల్లాపూర్‌, బల్మూర్‌ మండలాల్లో అధికం

జిల్లాలోని సంతల్లో యథేచ్చగా అమ్మకాలు

కఠిన చట్టాలున్నా ఆగని తీరు

Advertisement
 
Advertisement
Advertisement