ఆదివాసీల అభ్యున్నతికి ‘ఇన్‌క్లూజివ్‌ లైలీహుడ్‌’ | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల అభ్యున్నతికి ‘ఇన్‌క్లూజివ్‌ లైలీహుడ్‌’

May 16 2026 1:33 AM | Updated on May 16 2026 1:33 AM

మన్ననూర్‌: ఆదివాసిల్లో అత్యంత పేద, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ ఇన్‌క్లూజివ్‌ లైలీహుడ్‌’ ప్రోగ్రామ్‌ రూపకల్పన చేస్తుందని కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ అన్నారు. శుక్రవారం ఆయన నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలో మల్లాపూర్‌ చెంచుపెంటను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన చెంచుల జీవన విధానం, ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల కల్పన తదితర అంశాలపై ఆరా తీశారు. మన్ననూర్‌కు ఆమ్లేట్‌ విలేజ్‌గా ఉన్న మల్లాపూర్‌ పెంటలోని 34 చెంచు కుటుంబాల స్థితిగతులను పరిశీలించి, వారితో సమస్యలు తెలుసుకున్నారు.

సంక్షేమ పథకాలు అందట్లేదు..

ఆర్డీటీ అధికారులు కట్టించిన ఇళ్లే మాకు దిక్కని.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని చెంచులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తే ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి రోడ్డు, అంగన్‌వాడీ, చౌకధరల దుకాణం, తాగునీటికి శాశ్వత పరిష్కారం, పంటలు సాగు చేసుకోవడం కోసం ఎద్దులు, వన్యప్రాణుల నుంచి పంటలు కాపాడుకోవడం సోలార్‌ ఫెన్సింగ్‌ అందించాలని కోరారు. ఉపాధి పనులు చేస్తున్నా మస్టర్‌లో పేర్లు లేవనే సాకుతే తమకు డబ్బులు చెల్లించడం లేదని వాపోయారు. వేలి ముద్రలు తీసుకోకపోవడంతో అకౌంట్లలో డబ్బులు తీసుకోవడానికి వీలు కావడంలేదు. మహిళా సమాఖ్యల ద్వారా లోన్‌ తీసుకుని వ్యవసాయం, మేకల పెంపకం తదితర వాటికి పెట్టుబడి పెడితే వాటికి తగిన రక్షణ లేక నష్టపోతున్నామని మహిళలు వాపోయారు. అంతకు ముందు అడవిలో దొరికే సహజమైన అడవి పూలు, కాయలతో పాటూ చెంచు సాంప్రదాయ నృత్యాలతో చెంచులు కలెక్టర్‌కు స్వాగతం పలికారు. అనంతరం వారం రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో కాలిపోయిన చిగుర్ల చిన్న గంగయ్య పూరి గుడిసె శిథిలాలను అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అధివృద్ధి సంస్థ పీడీ చిన్న ఓబులేష్‌, అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, సర్పంచ్‌ మంజుల రాజారాం, ఉప సర్పంచ్‌ రమణగౌడ్‌, ఎంపీడీఓ లింగయ్య, ఈజీఎస్‌ ఏపీఓ రఘు, కార్యదర్శి భీముడు తదితరులు పాల్గొన్నారు.

జీవనోపాధి కల్పించాలి

దశాబ్దాల కాలంగా అటవీ ప్రాంతాన్నే నమ్ముకుని బతుకుతున్న చెంచులకు జీవనోపాధి కల్పించి, వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ప్రభుత్వం తరుఫున కొత్త కార్యచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. పశుపోషణ, కోళ్లపెంపకం, చిరు వ్యాపారాలు, అటవీ ఉత్పత్తుల ఆధారిత ఉపాధి, వ్యవసాయ అనుభంధ రంగాల్లో శిక్షణ ఇచ్చి చెంచుల ఆదాయ వనరులు పెంచాలన్నారు. మళ్లీ 20వ తేదీన ఇక్కడి వస్తానని, అప్పటి వరకు మహిళల ఆర్థిక సాధికారతకు అవసరమైన ప్రత్యేక పథకాలకు రూపకల్పన చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement