పాలమూరు/నాగర్‌కర్నూల్: అనుకున్నట్లే.. సామాన్యుడిపై పెట్రో, డీజిల్ బాంబు పడింది. పశ్చిమాసియాలో కొనసాగతోన్న యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడు చమురు ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా చముర కొరత వల్ల పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్త ధరల ప్రకారం మహబూబ్‌నగర్‌లో పెట్రోల్ లీటర్ రూ.108.41 ఉండగా.. ప్రస్తుతం రూ.111.80కి పెరిగింది. డీజిల్ రూ.96.59లు ఉండగా... ప్రస్తుతం రూ.99.85కి పెరిగింది. ఈ లెక్క ప్రకారం పెట్రోల్ రూ.3.39, డీజిల్ 3.26 చొప్పున పెరిగాయి. ధరల పెంపు సామాన్యుడిపై తీవ్ర భారం పడే అవకాశం ఉంది. నిత్యవసర ధరలు కూడా పెరుగుతాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుకు సగటున 15 లక్షల లీటర్ల పెట్రోల్, 70 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. 44వ నంబర్‌జాతీయ రహదారిపై ఉన్న బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. పెరిగిన ధరలతో ప్రతిరోజూ వాహనదారులపై దాదాపు రూ.3 కోట్ల వరకు అదనపు భారం పడనుంది.
పేదలపై భారం మోపొద్దు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర ధరలు పెరగకుండా నియంత్రించాలి. పేదలు, సామాన్యులపై భారం మోపొద్దు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో అన్ని రంగాలపై ఆ ప్రభావం ఉంటుంది. ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలి. అలాగే పెరిగిన ఎల్పీజీ గ్యాస్ ధరలను తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తేవాలి. – మర్రి జనార్దన్ రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్
యుద్ధ ప్రభావంతో..
అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఏర్పడిన సంక్షోభంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ప్రుభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలోనే చాలా దేశాలు ఇంధన వినియోగంపై ఆంక్షలు విధించాయి. కానీ బీజేపీ ప్రభుత్వం ఇన్నాళ్లు ఆ నష్టాలను భరిస్తూ వచ్చింది. కానీ యుద్ద ప్రభావం ఇంకా కొనసాగుతున్న తరుణంలో ప్రధాని మొదటగా స్వీయ నియంత్రణ పాటించిన తర్వాతే ధరలు పెంచేందుకు మొగ్గు చూపారు. అందుకే ప్రధాని ఈవీ వెహికిల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వండని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. – నరేందర్‌రావు,
బీజేపీ జిల్లా అధ్యక్షుడు, నాగర్‌కర్నూల్
వాహనదారుల జేబుకు చిల్లు
పాలమూరులో పెట్రోల్‌పై రూ.3.39, డీజిల్‌పై 3.26 పెంపు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ రూ.3కోట్ల అదనపు భారం


