ఒత్తిడి తగ్గించే టెలీమానస్
● ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకుఅందుబాటులోకి..
● యాక్టివ్ చేసిన వైద్య, ఆరోగ్య శాఖ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఆరోగ్య శాఖ ‘టెలీమానస్’ను యాక్టీవ్ చేసింది. కొన్నిరోజుల నుంచి ఆరోగ్య శాఖ ప్రత్యేక కౌన్సిలర్ ఇంటర్ కళాశాలలను సందర్శించి టెలీమానస్‌పై అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థులు ఒత్తిడిని ఎలా అధిగమించాలనే అంశాలను వివరించారు. పరీక్షలంటే విద్యార్థులు ఒత్తిడికి గురవకుండా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా టెలీమానస్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబర్ 14416 లేదా 1800–89–14416ను సంప్రదించాలి. 24 గంటలపాటు సేవలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌ను సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లు, కౌన్సిలర్లు అటెండ్ చేసి విద్యార్థులకు అవసరమైన సూచనలు చేస్తారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారితోపాటు మానసిక ఒత్తిడిలో ఉన్నవారికి ఇది ఉపయోగేపడే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లాకు సంబంధించి జడ్చర్లలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి దీనిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 45 ఫోన్ కాల్స్, నాగర్‌కర్నూల్ 21, వనపర్తి 10, గద్వాల 63, నారాయణపేట 27 కాల్స్ టెలీమానస్‌కు వచ్చాయి. ఇందులో అధికంగా విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో టెలిమానస్ సేవలు వినియోగించుకునే వారి సంఖ్య మరింత పెరగనుంది.
సమయపాలన ముఖ్యం..
చుట్టూ ఉండే వాతావరణం ఇతరులతో పోలిక వంటి వాటి కారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. తల్లిదండ్రులు వారిని అవసరమైన మేర ప్రోత్సహించి నడిపించాలి. చదువు విషయంలో ప్రణాళిక, సమయపాలన ఎంతో ముఖ్యం. కష్టమైన సబ్జెక్టు ఉంటే ప్రతిరోజు 30 నిమిషాలు చదివేందుకు కేటాయించాలి. మెదడును పరీక్షలపై ప్రణాళికబద్ధంగా అలవాటు చేయడం ఉత్తమం. నిత్యం ఒకే సమయం లేదా ఒకే ప్రాంతంలో చదువుకునేందుకు అలవాటు చేస్తే ఫలితాలు మెరుగైన పద్ధతిలో వస్తాయి.
– వంగీపురం శ్రీనాథాచారి,
మానసిక నిపుణుడు


