భక్తిశ్రద్ధలతో గోదాదేవి కల్యాణం
కందనూలు: జిల్లాకేంద్రం ఓంనగర్ కాలనీలోని శ్రీపబ్బతి హనుమాన్ ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేక పూజలలో భాగంగా మంగళవారం గోదాదేవి కల్యాణం భక్తిశ్రద్ధలతో జరిపించారు. గోదాదేవి కల్యాణంలో విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, మధుపర్కం, మంగళాష్టకాలు, కన్యాదానం, జీలకర బెల్లం, మహా సంకల్ప పఠనం, మాంగళ్యధారణ, తలంబ్రాలు వేద ఆశీర్వచనం వేదమంత్రోచ్ఛరణాల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అజయ్‌కుమార్ శర్మన్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, తిరుమల కిరణ్, వంగీపురం శ్రావణ్, గోపాలచార్యులు, చక్రవర్తి శ్రీనివాసచార్యులు, విజయ రాఘవాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
అందుబాటులో
1,235 టన్నుల యూరియా : కలెక్టర్
కందనూలు: జిల్లాలో ప్రస్తుతం 1,235 టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే బుధ, గురువారం జిల్లాకు మరో 1,340 టన్నుల యూరియా రానుందని, ఈ నెలలో మొత్తం 4,349 టన్నుల యూరియా జిల్లాకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. జిల్లాలో మొక్కజొన్న విస్తీర్ణం 6 రెట్లు పెరిగినందున యూరియాకు డిమాండ్ చాలా పెరిగిందని, డిమాండ్ అనుగుణంగా యూరియా సరఫరాకు ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. యూరియా విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.


