పల్లెల్లో నవకాంతి..
● జిల్లాలో మొదలైన సంక్రాంతి పండుగ సందడి
● చూడముచ్చటగా రంగవల్లులు.. పిండివంటల ఘుమఘుమలు
● భోగి మంటలు, రేగిపండ్లతో చిన్నారులకు ఉత్సవం
● స్వగ్రామాలకు తరలివస్తున్న బడుగు జీవులు
● సంస్కృతి, సంప్రదాయాలు
ప్రతిబింబిస్తున్న పండుగ
జీవితంలో కొత్తదనాన్ని స్వాగతిస్తూ.. పాత వస్తువుల్ని మంటల్లో వేయడంతో భోగి పండుగ ప్రారంభమవుతుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి బోగి మంటలు వేసి.. అందులో నీటితో నింపిన కుండలో కాగిన వేడి నీటితో చిన్న పిల్లలకు రేగు పళ్లు, నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేయించి కొత్త దుస్తులు ధరింపజేసి పీటలపై కూర్చోబెడతారు. తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు, ఇరుగు పొరుగు వారు బోగి పండ్లు పోసి.. హారతి ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఇలా చేస్తే దిష్టి పోతుందని, ఆయు వృద్ధి కలుగుతుందని నమ్మకం.
నేలమ్మకు రంగుల తిలకం..
భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజులు ఇళ్ల ముంగిట ముత్యాల ముగ్గుల సొబగులను చూడాల్సిందే. కల్లాపి చల్లిన ఇంటి ముంగిళ్లను రంగవల్లులతో తీర్చిదిద్దేందుకు యువతులు, మహిళలు ఆసక్తి చూపిస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ వివిధ రకాల ముగ్గులు వేసి రంగులు అద్దుతారు. ముగ్గుల మధ్య ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు, రేగు పళ్లు, నవధాన్యాలు, గరికె పోసలు, పూలు ఉంచి అందంగా అలంకరిస్తారు. అలాగే భోగి పండగ రోజు అందరి ఇళ్లల్లో నువ్వుల రొట్టెలు చేయడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కొందరు బియ్యం పిండి, మరికొందరు జొన్నపిండిలో నువ్వులు వేసి రొట్టెలు చేసుకోవడం ఆనవాయితీ. చలికాలం కావడం వల్ల నువ్వులు వంటికి వేడిని అందిస్తాయని భోగి రోజున వాటిని చేసుకుని ఆరగిస్తారు.


