సంస్కృతికి ప్రతీక.. సంక్రాంతి పండుగ
నాగర్‌కర్నూల్: జిల్లా ప్రజలకు కలెక్టర్ బదావత్ సంతోష్ భోగి, మకర, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ వేళ తెలుగు లోగిళ్లు అలనాటి అనుభూతులకు వేదికలుగా మారుతాయన్నారు. ప్రతిఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిన్నారులు గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు.
క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోండి
కందనూలు: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి సీఎం కప్–2026ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిందని, కాబట్టి జిల్లాలోని ఆసక్తిగల క్రీడాకారులు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని డీవైఎస్‌ఓ సీతారాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని క్రీడాకారులందరికీ వివిధ విభాగాల్లో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క్రీడల పోటీలు ఉంటాయన్నారు. గ్రామస్థాయిలో ఈ నెల 17 నుంచి 22 వరకు, మండల స్థాయిలో 28 నుంచి 31 వరకు, నియోజకవర్గ స్ధాయిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు, జిల్లా స్థాయిలో 9 నుంచి 12 వరకు, రాష్ట్రస్థాయిలో 20 నుంచి 23 వరకు పోటీలు నిర్వహిస్తారని చెప్పారు. 46 విభాగాల్లో పోటీలు నిర్వహించి టీమ్ గేమ్‌కు ప్రథమ బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.75 వేలు, తృతీయ బహుమతి రూ.50 వేలు, అలాగే ఇండివూజువల్ గేమ్‌కు ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు అందజేస్తారన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు http://satg. telangana.gov. in/cmcup/ వెబ్‌సైట్‌లో ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తేనెటీగలు, పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన
వెల్దండ: మండలంలోని కంటోనిపల్లి గ్రామంలో తేనె టీగల పెంపకం, పట్టుపరిశ్రమలపై మంగళవారం రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కల్వకుర్తి డివిజన్ అధికారి మహేశ్వరి మాట్లాడుతూ రైతులు వ్యవసాయంతోపాటు కూరగాయల పెంపకంతో ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చన్నారు. అదేవిధంగా తేనె టీగల పెంపకం, పట్టు పరిశ్రమలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి వివరించారు. ఒక్కొక్క రైతులు సబ్సిడీలో 18 కూరగాయల బుట్టలు, రూ.10 వేలు కూలీ ఖర్చులు, రెండు తేనె పెట్టెలు, రెండు వర్మీ బెడ్స్ రైతులకు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది ఆదిశంకర్, శాస్త్రవేతలు, రైతులు పాల్గొన్నారు.
సంస్కృతికి ప్రతీక.. సంక్రాంతి పండుగ


